ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. శవాన్ని గోనెసంచిలో మూటగట్టీ...
భార్య చేతిలో మరో పురుషుడు హత్యకు గురయ్యాడు. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చిందో కసాయి భార్య. ఆ తర్వాత శవాన్ని గోనె సంచిలో మూటగట్టి అటవీ ప్రాంతంలో పడేసింది. ఈ దారుణం అనంతపురం జిల్లా యల్లనూరులో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యల్లనూరుకు చెందిన డి.చిన్న ఆంజనేయులు (38)కు భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆంజనేయులు లారీ డ్రైవర్‌గానూ, రాజేశ్వరి ఆశావర్కర్‌గా పనిచేస్తోంది. రాజేశ్వరి కొంత కాలంగా తాడిపత్రి ప్రాంతానికి చెందిన వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను పలుమార్లు మందలించారు. అయినా ఆమె వైఖరిలో ఎలాంటి మార్పురాలేదు.
ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చాలని రాజేశ్వరి ప్లాన్ చేసింది. ఇందుకోసం ప్రియుడు సాయం కోరింది. తమ ప్లాన్‌లో భాగంగా, గత శుక్రవారం రోజున ఆంజనేయులు, రాజేశ్వరి ప్రియుడు మద్యం సేవించారు. రాజేశ్వరి సూచనల ప్రకారం చిన్న ఆంజనేయులును హత్య చేసి, శవాన్ని గోనె సంచుల్లో కట్టి సమీపంలోని చెరువు వద్ద గల చింత వనంలో పడేసి వెళ్లారు.
ఆ తర్వాత ఎవరికీ అనుమానంరాకుండా ఉండటానికి చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. శుక్రవారం సాయంత్రం డబ్బులు కావాలంటూ తనతో భర్త గొడవపడ్డాడని, డబ్బు ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని కోపంగా చెప్పి వెళ్లిపోయాడని సమీప బంధులకు ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా, అటవీ ప్రాంతంలో భర్త శవమై ఉన్నట్టు గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేసి, చివరకు పోలీసులకు చిక్కిపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రాజేశ్వరితో పాటు.. ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.