శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2019 (18:29 IST)

స్మార్ట్‌సిటీగా ‘అనంత’: మంత్రి బొత్స

అనంతపురం నగరాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతామని జిల్లా ఇన్‌చార్జ్, రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా త్వరితగతిన నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు చేపడతామన్నారు.

మంగళవారం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, కలెక్టర్‌ సత్యనారాయణ, కమిషనర్‌ ప్రశాంతితో కలిసి 2, 9వ డివిజన్ల పరిధిలోని బిందెల కాలనీ, కల్పనా జోషి కాలనీ, యల్లమ్మ కాలనీ, ఎస్సీ కాలనీ, వినాయకనగర్‌ ప్రాంతాల్లో మంత్రి బొత్స పర్యటించారు.

కల్పనా జోషి కాలనీలో ఇళ్ల మధ్యలో పెద్ద ఎత్తున మురుగునీరు నిల్వ ఉండడంతో అందుకు గల కారణాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. 9వ డివిజన్‌లో నీటి సమస్య ఉందని స్థానికులు తెలియజేయడంతో కమిషనర్‌ ప్రశాంతి, నగర పాలక సంస్థ అధికారులతో ఆరా తీశారు.

ప్రెజర్‌ ఎక్కువగా ఉండడంతో సరిగా సరఫరా కావడం లేదని చెప్పడంతో ఇలాంటి సమస్య ఎక్కడ ఉన్నా చెక్‌ పెట్టాలని సూచించారు. కాలనీల్లో పర్యటన తర్వాత గుత్తి రోడ్డులోని డంపింగ్‌ యార్డును పరిశీలించారు. అక్కడి నుంచి నారాయణపురం సమీపంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న డంపింగ్‌ యార్డు ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ ప్రాంతం నగరానికి కాస్త దూరంగా ఉండడంతో నగరం నలువైపులా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేసేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అక్కడే అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. ‘నగరంలో పర్యటించిన సమయంలో డ్రెయినేజి వ్యవస్థ సరిగా లేదని తెలుసుకున్నాం.

నీరంతా ఇళ్ల మధ్యలోకి వెళ్తోంది. దుర్గంధం వస్తోంది. ప్రజలకు ఇబ్బందిగా ఉంది. రోడ్లు సరిగా లేవు. తాగునీరు సరిగా సరఫరా కావడం లేదు. ఈ విషయాలన్నీ మా దృష్టికి వచ్చాయి. ఏదో వచ్చాం..వెళ్లాం అనికాకుండా సమస్యలన్నీంటికీ శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపుతాం’ అని స్పష్టం చేశారు.

నగరంలో రోడ్లు, కాలువలు సరిగా లేవని, లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందిగా ఉన్నట్లు తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారంగా అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ త్వరితగతిన చేస్తామన్నారు. ప్రజలకు ఇబ్బందిగా ఉన్న డంపింగ్‌ యార్డును తరలిస్తామని తెలిపారు. ప్రత్యామ్నాయంగా నగరానికి నాలుగు వైపులా యార్డులు ఏర్పాటు చేస్తామన్నారు.

ఇందుకు సంబంధించి స్థలాలు గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు చెప్పారు. రూ.50 కోట్లతో బయో మైనింగ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. నగర ప్రజలు ఆహ్లాదం పొందడం కోసం గుత్తి రోడ్డులో ఆరు ఎకరాల్లో సెంట్రల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇందుకోసం డీపీఆర్‌ తయారవుతోందన్నారు.

అనంతపురం నగరానికి ఏది అవసరమైనా క్రమంగా చేస్తామని, అభివృద్ధి పనులకు సంబంధించి యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలని అక్కడే ఉన్న కలెక్టర్‌ సత్యనారాయణ, కమిషనర్‌ ప్రశాంతికి ఆదేశాలు జారీ చేశారు. గుత్తి రోడ్డులోని 80 అడుగుల రోడ్డుకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, అధికారులతో చర్చించి సమస్య పరిష్కరించనున్నట్లు తెలిపారు.

హౌసింగ్‌ బోర్డులోని చిల్డ్రన్స్‌ పార్క్‌ను బాగు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.  టీడీపీ హయాంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకున్నారని, అక్రమార్కులపై తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు. తమ ప్రభుత్వంలో అవినీతిని సహించేది లేదని, ప్రజలకు పారదర్శక పాలన అందిస్తామని స్పష్టం చేశారు.
 
సుందర నగరంగా తీర్దిదిద్దుతాం
అనంతపురం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకే జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ కాలనీల్లో పర్యటించినట్లు చెప్పారు.

ఈ పర్యటన ఫలితాలు త్వరలోనే ప్రజలకు చేరువ అవుతాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. నగర అభివృద్ధికి ప్రజలు సహకారం అందించాలని కోరారు.

కార్యక్రమంలో ఎంపీ రంగయ్య, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్‌ఈ రాజేంద్రకృష్ణ, ఈఈ నాగమోహన్, డీఎస్పీ వీరరాఘవరెడ్డి, తహశీల్దార్‌ రామాంజనేయులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.