శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:48 IST)

అవినీతి రహిత పౌర సేవలు... మంత్రి బొత్స

రాష్ట్రంలోని పురపాలక శాఖ ద్వారా ప్రజలకు అవినీతి రహిత సేవలు అందించాలని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స‌ సత్యనారాయణ రాష్ట్రంలోని మున్సిపల్ కమీషనర్లకు సూచించారు.

పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మున్సిపల్ కమీషనర్లకు రెండు రోజులపాటు విజయవాడలో నిర్వహిస్తున్న కార్య‌శాల‌లో భాగంగా తొలిరోజు కార్యక్రమానికి గురువారం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను అనుసరించి క్షేత్రస్థాయిలో ఉద్యోగులు బాధ్యతలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతా అంశాలు ఉంటాయని తమ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ అమలుచేయడానికి కృత నిశ్చయంతో ఉందని అధికారులు తదనుగుణంగా పనిచేయాలన్నారు.

రాష్ట్రంలో మునిసిపాలిటీలలో కొత్తగా 71,400 మంది వార్డు వాలంటీర్లను నియమించామని ఆగష్టు 15 నుండి విధుల్లోకి వచ్చారన్నారు. 37 వేల మందికి పైగా వారు సెక్రటరీల నియామకానికి పరీక్షలు నిర్వహించామని అక్టోబరు 2 నుండి వారు కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులోకి వస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇన్ని లక్షల ఉద్యోగ నియామకాలు జరగలేదన్నారు.

గతాన్ని పరిశీలిస్తే ఎప్పుడూ ఉన్నతస్థాయిలోనే ఉద్యోగాలు భర్తీ చేస్తుండేవారని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను తెలుసుకొని గ్రామ, వార్డు స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకాలను చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకనుగుణంగా అవినీతి రహిత పాలన అందించేందుకు ముందుకు రావాలని కోరారు.  ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రతి లబ్దిదారునికి ఇంటి ముంగిటే అందించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు.

ఆ ఆలోచనలకు అనుగుణంగానే గ్రామ వార్డు వాలంటీర్లు, సెక్రటరీల వ్యవస్థలను ఏర్పాటు చేసి కమీషనర్లకు పెద్ద ఎత్తున సపోర్టింగ్ స్టాప్ ను ఇస్తున్నామన్నారు. గతంలో పురపాలక పట్టణాభివృద్ధి స్వచ్ఛాంధ్ర, మెప్మా తదితర శాఖల మధ్య సమన్వయ లోపం ఉండేదని వాటిని అధిగమించే దిశలో అధికారులు సమన్వయంతో ముందుకెళ్ళాలని మంత్రి తెలిపారు.

మున్సిపాలిటీలలో ఒకే ఛానల్లో అన్ని ఉండాలని మున్సిపల్ కమీషనర్లకే అధికారం ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం కావాలంటే అధికారులతో సమన్వయం ఉండాలన్నారు. ఇక ముందు సమీక్షా సమావేశాలు రాష్ట్ర స్థాయిలో కాకుండా క్షేత్రస్థాయిలోనే నిర్వహిస్తామని తెలిపారు.

ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మంది ఇళ్ళులేని వారికి ఇళ్ళపట్టాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఆదేశించారని అయితే పట్టణ ప్రాంతాలలో సుమారు 10 లక్షల మందికి ఇళ్లు అవసరమవుతాయని వారికి సంబంధించిన డేటాను వార్డు వాలంటీర్లు ద్వారా సేకరించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంద‌ని దానిని త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు.

పట్టణ ప్రాంతాలలో పేదలకు గృహనిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా నిరక్షరాస్యత శాతాన్ని సున్నాకు తీసుకు వచ్చేందుకు పాఠశాలలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్య కోసం మున్సిపాలిటీలలో ఒక అధికారిని నియమించే అంశాన్ని పరిశీలించాలన్నారు.

ప్రతి సోమవారం విధిగా స్పందన కార్యక్రమంలో పాల్గొని ప్రజల విజ్ఞప్తులకు వెంటనే స్పందించాలన్నారు. డిసెంబరు నెలలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో జలశక్తి అభియాన్ ద్వారా వాటర్ గ్రిడ్ల ఏర్పాటు చేస్తున్నామని తొలిదశలో 4 జిల్లాలలో (శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి) పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగిందన్నారు. 
 
మున్సిపల్ కమీషనర్లూ .. ఫోన్ కాల్స్‌కు స్పందించండి..
ప్రజలు ఏదో ఒక సమస్య ఉంటేనే అధికారులకు ఫోనుచేస్తారని వాటికి స్పందించడం అధికారుల కనీస కర్తవ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్బోధించారు. ఫోనుకు స్పందిస్తే ప్రజలలో ప్రభుత్వం, అధికారులపై సానుకూల దృక్పధం ఏర్పడుతుందని, తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వారిలో కలుగుతుందన్నారు.

పారిశుధ్యంపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తుంటాయని వాటి బాధ్యతను మనం తీసుకోవలసి ఉంటుందన్నారు. ఈ సమయంలో సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ తదితర జ్వరాలు ప్రభలే అవకాశం ఎక్కువగా ఉంటాయని గతంలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అందుకు తగిన విధంగా ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు.

ఇకముందు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తామని అధికారులు సిబ్బంది ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం ఇవ్వకుండా అప్రమత్తతతో పనిచేయాలన్నారు. ఇటీవల జరిగిన బదిలీలలో 95శాతం మందిని వారు కోరుకున్నచోటుకే బదిలీచేశామని, వారు కూడా మరింత బాధ్యతగా ప్రజలకు సేవలందించాలన్నారు. మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతాయన్నారు.

ఎన్నికల ముందు నుండి బిల్లులు విడుదల చేయకుండా వాటిని ఇతర కార్యక్రమాలకు వినియోగించడం దారుణమన్నారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ జె.శ్యామలరావు మాట్లాడుతూ సిటీ డెవలప్ మెంట్, అడ్మినిస్ట్రేషన్ బాగుంటే రాష్ట్రమంతా బాగుంటుందన్నారు. అర్బన్ ప్రాంతాలలో జరిగే అన్ని కార్యమ్రాలకీ మునిసిపల్ కమీషనర్లు బాధ్యత వహించాలన్నారు.

పరిపాలనకు సంబంధించిన బాధ్యతలలో జిల్లాలలో కలెక్టర్లు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో నగరపాలనకు సంబంధించి మునిసిపల్ కమీషనర్లు అంతే పవర్ ఫుల్ అని తెలిపారు. అవినీతి రహిత పాలన అందించడం, సాధారణ ప్రజలకు వేధింపులు లేకుండా ప్రభుత్వ సేవలందించడం, సంక్షేమ పథకాలను ప్రజల గుమ్మం దగ్గరకే తీసుకువెళ్ళి అందజేయడం, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండటం అనేవి ప్రభుత్వ ప్రాధామ్యాలని వాటికనుగుణంగా మునిసిపల్ కమీషనర్లు పనిచేయాలని ఆయన సూచించారు.

వేస్ట్ మేనేజ్ మెంట్లో ప్రజలను కూడా మోటివేట్ చేసి వారిలో అవేర్ నెస్ క్రియేట్ చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని తద్వారా సీజనల్ వ్యాధులను కంట్రోల్చేయడం సాధ్యపడుతుందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్, ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా, హౌసింగ్ సర్వే, అప్లోడింగ్ తదితర అంశాల గురించి కూడా వర్క్‌షాపులో చర్చించడం జరుగుతుందన్నారు. 

 
కమీషనర్ & డైరెక్టర్ జి.ఎస్.కె.విజయకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ఎలాంటి అలసత్వం లేకుండా ప్రజలకు సేవలందించడంలో భాగంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ ఆలోచనలు ప్రాధామ్యాలు ఏమిటి వాటిని అమలు చేయడానికి రాబోయే 3 నెలలలో ఎలా ముందుకెళ్ళాలి అనే అంశాలతోపాటు వార్డు వలంటీర్లు, పారిశుధ్యం, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. శానిటేషన్ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కొన్ని సూచనలు చేసిందని వాటిని కూడా చర్చిస్తామన్నారు. విలేజ్/వార్డు సెక్రటరీల పరీక్షలను చాలా విజయవంతంగా నిర్వహించారని అందుకు ముఖ్యమంత్రి కూడా అభినందించారని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో ఎపిటిడ్కో ఎం.డి. దివాన్, డిటిసిపి వి.రాముడు, ఇఎనోసి చంద్రయ్య, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఎం.డి. సంపత్, ఎపియుఐఎఎంఎల్ ప్రకాష్, ఎడిషనల్ డైరెక్టర్ ఆషాజ్యోతి, విజయవాడ మునిసిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్, గుంటూరు కమీషనర్ లత్కర్, పలు మున్సిపల్ కార్పోరేషన్ల కమీషనర్లు, ఆర్జేడీలు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు.