గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 అక్టోబరు 2016 (08:08 IST)

మావో అగ్రనేత ఆర్కే హత్యకు కుట్ర.. ఏ క్షణమైనా మరణ వార్త వినొచ్చు!

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా - ఒడిషా సరిహద్దు(ఏవోబీ) రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జి అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఆయనను హతమార్చేందుకు పోలీసులు పక్కా స్కెచ్

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా - ఒడిషా సరిహద్దు(ఏవోబీ) రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జి అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఆయనను హతమార్చేందుకు పోలీసులు పక్కా స్కెచ్ వేశారు. అందువల్ల ఆర్కే మరణవార్త ఏక్షణమైనా వినొచ్చని ఆదివాసీ హక్కులు, సంస్కృతి పరిరక్షణ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దామోదర్‌ తిలక్‌ ఆరోపించారు. 
 
ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు దానియేల్‌ మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు శనివారం మల్కన్‌గిరి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఆర్కేతోపాటు మరో తొమ్మిది మంది మావోయిస్టులు, గిరిజనులు పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు. ఆర్కే ఎన్‌కౌంటర్‌ సమయంలో గాయపడ్డారని, పోలీసులు ఆయన్ను నిర్బంధించినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. పోలీసులు ఏ క్షణంలోనైనా ఆర్కేను చంపే అవకాశమందని ఆరోపించారు.
 
మావోయిస్టులకు టీలో మత్తుమందు కలిపి ఇచ్చి, ఏకపక్షంగా కాల్పులు జరిపి చంపేశారన్నారు. ఏవోబీ అటవీ ప్రాంతంలో సీపీఐ మావోయిస్టు పార్టీ బలోపేతానికి ఏర్పాటు చేసిన సమావేశంలో 34 నుంచి 39 మంది వరకూ పాల్గొన్నట్టు సమాచారం ఉందన్నారు. ఎదురుకాల్పుల్లో 30 మంది చనిపోగా మరో 9మంది పోలీసుల అదుపులోనే ఉన్నట్లు స్థానిక గిరిజనులు చెబుతున్నారన్నారు. 
 
ఇదిలావుండగా, ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా నవంబరు 3న ఏపీ, తెలంగాణ, ఒడిసా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల బంద్‌కు సీపీఐ మావోయిస్టు పార్టీ దర్వా డివిజన్‌ కమిటీ పిలుపునిచ్చింది. శనివారం దర్వా డివిజన్‌ కమిటీ మల్కన్‌గిరి జిల్లా విలేకరులకు హిందీలో ఓ ప్రకటనను పంపించింది. ఈ ప్రకటనలను మల్కన్‌గిరి నుంచి గిరిజన గ్రామాలకు వెళ్లే దారుల్లోనూ అంటించింది. ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌ పచ్చి బూటకమని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.