శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (08:27 IST)

ఆ ట్రంకు పెట్టెల్లోని నిధి... ఖజానా ఉద్యోగి ఖజానా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లో 8 ట్రంకుపెట్టెల్లో బయటపడిన బంగారు, వెండి ఆభరణాలు ఎవరన్న విషయాన్ని పోలీసులు తేల్చేశారు. ఆ నిధి మొత్తం ఖజానా శాఖలో పని చేసే ఓ ఉద్యోగికి చెందినవని గుర్తించారు. 
 
బుక్కరాయసముద్రానికి చెందిన డ్రైవర్ వద్ద ఖజానాశాఖలో పనిచేసే సీనియర్ అకౌంటెంట్ మనోజ్‌కుమార్ పెట్టెలు దాచిపెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మంగళవారం రాత్రి ప్రత్యేక పోలీస్ బృందం ఆ ఇంటిలో సోదాలు చేయగా, అక్కడ మొత్తం 8 ట్రంకు పెట్టెలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టిన 2.42 కిలోల బంగారు ఆభరణాలు, 84.10 కిలోల వెండి ఆభరణాలు, రూ. 15,55,560 నగదు, రూ. 49.10 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రూ. 27.05 లక్షల విలువైన బాండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
అలాగే, రెండు కార్లు, 7 మోటారు సైకిళ్లు, 4 ట్రాక్టర్లు సీజ్ చేశారు. పోలీసులు సీజ్ చేసిన ద్విచక్ర వాహనాల్లో ఖరీదైన మూడు బైక్‌లు ఉన్నాయి. మూడు 9ఎంఎం పిస్టళ్లు, తూటాలు, ఒక ఎయిర్‌గన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే, అవి నకిలీవని తేల్చారు.
 
ఈ మొత్తం జిల్లా ఖజానా శాఖ ఉద్యోగి అయిన మనోజ్‌ కుమార్‌దేనని, తన కారు డ్రైవర్ నాగలింగం మామ ఇంట్లో  పెట్టెలు దాచాడని పోలీసులు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి వరకు వాటి విలువను లెక్కించినట్టు వివరించారు. 
 
ఓ జిల్లా ఖజానా శాఖ ఉద్యోగి ఇంత పెద్ద మొత్తం ఎలా సంపాదించాడన్న దానిపై దర్యాప్తు చేసేందుకు ఏసీబీకి కేసును ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్టు ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు.