శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జులై 2020 (22:52 IST)

ఏపీ డిప్యూటీ సీఎంగా ధర్మాన కృష్ణదాస్ - మంత్రుల శాఖల్లో మార్పులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించారు. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలోని రెండు ఖాళీలను కొత్త వారితో భర్తీ చేశారు. ఈ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం జరిగింది. మంత్రులుగా సీదిరి అప్పల రాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణలు ప్రమాణ స్వీకారం చేశాలు. వీరికి సీఎం జగన్ మంత్రిత్వ శాఖలను కూడా కేటాయించారు. అలాగే, నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చేశారు. 
 
ముఖ్యంగా, ప్రస్తుతం మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్‌ నారాయణకు కేటాయించారు. అలాగే, సీదిరి అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖ బాధ్యతలు అప్పగించారు. 
 
ఇకపోతే, శంకర్‌ నారాయణ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించారు. కాగా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మత్య్స, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో.. వారు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.