త్రీ క్యాపిటల్స్ బిల్లు ఆమోదించవద్దు : ఆర్ఎస్ఎస్ నేత రతన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల అంశం సజావుగా పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. ఈ త్రీ క్యాపిటల్స్‌కు ఒక్క అధికార వైకాపా మినహా.. మిగిలిన ఏ ఒక్క పార్టీ అంగీకరించడం లేదు. ఇపుడు మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తున్న జాబితాలో ఆర్ఆర్ఎస్ కూడా చేరిపోయింది.
మూడు రాజధానుల బిల్లులకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శారదా ట్వీట్ చేశారు. ఆ బిల్లులను తిరస్కరించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు విజ్ఞప్తి చేశారు.
మూడు రాజధానులు అనేది ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అందువల్ల ఆ బిల్లును తిరస్కరించాలని ఆయన గట్టిగా కోరారు.
ఇప్పటికే, మూడు రాజధానుల బిల్లులు రెండుసార్లు తిరస్కరణకు గురయ్యాక, శాసనమండలిపై జగన్ పైచేయి సాధించాలనుకుంటున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. వనరులు వృథా కాకుండా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.