శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జులై 2020 (08:57 IST)

సీఎం జగన్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ - యూకేజీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రైవేటు స్కూల్స్‌లోనే ఉన్న ఎల్కేజీ, యూకేజీలను ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా విద్యావ్యవస్థలో ప్రాథమిక పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు. 
 
ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో వచ్చే యేడాది నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఎల్కేజీ, యూకేజీ విద్యను ప్రవేశపెట్టనున్నారు. ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు అనువైన కొత్త సిలబస్ రూపొందించాలని ఆదేశించారు. 
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, జగనన్న గోరుముద్ద అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ కేజీ, యూకేజీ విద్యపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్.. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించడం పట్ల అనేక మంది విద్యారంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. 
 
ఈ నిర్ణయం వల్ల అనేక మంది పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందనీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.