శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (09:44 IST)

దేశంలో కరోనా మరణ మృదంగం - ఒక్క రోజులో 587 మంది మృత్యువాత

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపించడమే కాదు... మరణ మృదంగంగా మారిపోయింది. ఫలితంగా కరోనా వైరస్ బారినపడిన అనేక మంది మృత్యువాతపడుతున్నారు. గడచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 587 మంది చనిపోయారు. అలాగే, మరో 37148 మందికి ఈ వైరస్ సోకిందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, తాజాగా సంభవించిన 587 మృతులతో కలుపుకుంటే దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 11,55,191కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 28,084కి పెరిగింది. 4,02,529 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 7,24,578 మంది కోలుకున్నారు.
 
కాగా, సోమవారం వరకు దేశంలో మొత్తం 1,43,81,303 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,33,395 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
తెలంగాణాలో కరోనా ఉధృతి 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,198 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 610 కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,274కి చేరింది.
 
తాజాగా మరో ఏడుగురు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 422కి పెరిగింది. ఇక, నేడు మరో 1,885 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 11,530 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ లో తెలిపారు.
 
అయితే, ఎప్పుడూ కరోనా గణాంకాలు మాత్రమే వెల్లడించే ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా, రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయో ఆ వివరాలు కూడా వెల్లడించింది. మొత్తం 17,081 పడకల్లో 2,122 భర్తీ అయ్యాయని, ఇంకా 14,959 ఖాళీగా ఉన్నాయని వివరించింది. ప్రత్యేకించి గాంధీ ఆసుపత్రిలో మొత్తం బెడ్లు 1,890 కాగా, ఇంకా 1,171 బెడ్లు ఖాళీగా అందుబాటులోనే ఉన్నాయని బులెటిన్‌లో వివరించారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం 
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. సోమవారం ఒక్కరోజు వ్యవధిలోనే 4,074 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1086 కేసులు వచ్చాయి.
 
గుంటూరు (596), కర్నూలు (559) జిల్లాల్లోనూ భారీగా కేసులు వెల్లడయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటిపోయింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 53,724 కేసులు నమోదయ్యాయి. 
 
ఇక, మరణాల సంఖ్య కూడా అదే రీతిలో పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 54 మంది మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 696కి పెరిగింది. ఇవాళ 1,335 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 28,800 మంది చికిత్స పొందుతున్నారు.