శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (09:34 IST)

దేశంలో సమూహ వ్యాప్తి లేదు.. ఎన్-95 మాస్కులతో ఉపయోగం లేదు!

దేశంలో కరోనా వైరస్ సమూహ వ్యాప్తి చెందినట్టు వస్తున్నట్టు వార్తలపై అఖిల భారత వైద్య విజ్ఞాన మండలి ఎయిమ్స్ స్పందించింది. దేశంలో కరోనా వైరస్ సమూహ వ్యాప్తి మొదలైందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అలా అని చెప్పేందుకు పక్కా ఆధారాలు లేవని, అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్థానిక వ్యాప్తి ఉందని పేర్కొంది.
 
ఇదే అంశంపై ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందిస్తూ, నగరాల్లో స్థానిక వ్యాప్తి కనిపిస్తోందన్నారు. ఢిల్లీలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో వైరస్ తీవ్ర దశకు చేరుకోవాల్సి ఉందని అన్నారు. 
 
ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్న 18-55 ఏళ్ల వయసున్న వారిపై తొలిదశ వ్యాక్సిన్ ప్రయోగాలు చేపట్టినట్టు పేర్కొన్న గులేరియా.. 12-65 ఏళ్ల వయసున్న 750 మందిపై రెండో దశ ప్రయోగాలు చేపడతామని వివరించారు. 
 
మొత్తం 1,125 నమూనాలు సేకరించామని, వాటిలో 375 నమూనాలపై తొలిదశ అధ్యయనం చేపట్టనున్నట్టు చెప్పారు. అలాగే, ఇటలీ, స్పెయిన్, అమెరికా వంటి దేశాల కంటే మన దేశంలో వైరస్ మరణాలు తక్కువగా ఉన్నాయని, దేశంలో ఆదివారం మరణాల రేటు 2.5 శాతం కంటే తక్కువకు చేరుకుందని రణ్‌దీప్ గులేరియా వివరించారు.
 
మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కవాటం ఉన్న ఎన్-95 మాస్కులు వినియోగించవద్దని, ఇవి  వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. 
 
ఎన్-95 మాస్కులతో ఉపయోగం లేదు 
ఆరోగ్య కార్యకర్తలుకాకుండా ఇతరులు కవాటాలతో ఉన్న ఈ ఎన్-95 మాస్కులను ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడాన్ని తాము గమనించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ఇంట్లో తయారు చేసిన రక్షణ కవచాలను, సాధారణ మాస్కులను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు.