సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (11:42 IST)

సీఎం జగన్ పాలనలో ప్రభుత్వ మద్యం దుకాణాలు : మంత్రి కె.నారాయణస్వామి

రాష్ట్రంలో దశలవారీ మద్యనిషేదంపై రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వెయ్యడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె.నారాయణ స్వామి శనివారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ప్రజాసంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలుకు చర్యలు ప్రారంభించామన్నారు. 
 
అక్టోబరు ఒకటో తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు జరుగుతుందన్నారు. ఇక ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం విక్రయాలు నిర్వహిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా 3500 ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతనెలలో 475 ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించామని, ఎపి బేవరేజెస్‌ ర్పోరేషన్‌ ద్వారా ఈ మద్యం దుకాణాల నిర్వహణ ఉంటుందన్నారు. ఇప్పటికే 3448 మద్యం షాపులను టెండర్ల ద్వారా అద్దెకు తీసుకున్నామన్నారు. 
 
మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే తెరిచి ఉంటాయన్నారు. ఈ దుకాణాల్లో 3500 మంది సూపర్‌వైజర్లు, 8033 మంది సేల్స్‌మెన్‌‌ల నియామకం జరిగిందన్నారు. మహిళల కష్టాలను, బాధలను తీర్చేందుకు దశలవారీ రాష్ట్రంలో మద్య నిషేధంకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్రభుత్వం మద్యంను ఆదాయంగా భావించిందన్నారు. గతంలో 4380 షాప్‌‌ల ద్వారా ప్రతి షాప్‌‌కు పది బెల్ట్ షాప్‌‌లను చొప్పున 43 వేల బెల్ట్ షాప్‌లు ఏర్పాటుతో 47 వేల షాపులను నిర్వహించారన్నారు. 
 
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ప్రభుత్వం బెల్ట్ షాప్‌‌లపై ఉక్కుపాదం మోపిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బెల్ట్ షాప్‌‌లను పూర్తిస్థాయిలో నిర్మూలించగలిగామని మంత్రి కె. నారాయణ స్వామి తెలిపారు. బెల్ట్ షాప్‌ నిర్వాహకులపై 2872 కేసలు నమోదు చేసామని, 2928 వ్యక్తులను అరెస్ట్ చెయ్యడం జరిగిందన్నారు. నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపామని, 4788 కేసుల్లో 2834 మంది వ్యక్తులను అరెస్ట్ చేయ్యడం జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా 18 బోర్డర్‌ మొబైల్ పెట్రోలింగ్‌ పార్టీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంటర్‌ స్టేట్‌ బోర్డర్‌‌లలో 31 చెక్‌ పోస్ట్‌లు పనిచేస్తున్నాయన్నారు. 
 
సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది చిత్తశుద్దితో పనిచేస్తున్నారన్నారని, వారిని అభినందిస్తున్నానన్నారు. ఎక్సైజ్‌ శాఖలో సిబ్బంది కొరతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. రాష్ట్రంలో ఆబ్కారీ శాఖలో 678 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు ఇచ్చామనీ, ముఖ్యమంత్రి వీటి భర్తీకి సానుకూలంగా స్పందించారన్నారు. రాత్రి వేళ్లలో నైట్‌‌వాచ్‌మెన్‌, సిసి కెమేరాలను కూడా షాప్‌‌ల వద్ద నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దుకాణాల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతలను ప్రతి సిఐ, ఎస్‌ఐ‌లకు పది షాప్‌ల చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పూర్తిగా బాధ్యత తీసుకుంటోందన్నారు. 
 
పై స్థాయినుంచి కింది వరకు చిత్తశుద్దితో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. సారాయి, అక్రమ మద్యం రవాణా లేకుండా చర్యలులో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడం కోసం డీ అడిక్షన్‌ సెంటర్‌‌లను అన్ని హాస్పటల్స్‌లోనూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మద్యం మీద ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు. మద్యపాన నిషేధంకు అందరి సహకారం అవసరం. అందరం కలిసి మద్యం రక్కసిని నిర్మూలిద్దామని మంత్రి పిలుపు ఇచ్చారు. 
 
మద్యపాన నిషేదంపై ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం, మద్యం ధరల పెరుగుదల పై అధ్యయనం చేస్తున్నామన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ధరలు ఏ విధంగా వున్నాయో పరిశీలిస్తున్నామని, గతంలో బార్లు రాత్రి పదకొండు గంటల వరకు తెరిచి ఉంచేవారని ఈ సమయాలను తగ్గించాలని ఆలోచిస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్వహించే షాప్‌ల వల్ల ఆదాయం తగ్గదని, రిటైలర్‌ లకు ఇచ్చే పదిశాతం ఇన్సెంటీవ్‌ ప్రభుత్వానికే మిగులుతుందని తెలిపారు.
 
ఆదాయం కన్నా ప్రభుత్త్వా నికి ప్రజాసంక్షేమమే ముఖ్యమని, అందులో భాగంగా నే ఒక వ్యక్తికి మూడు బాటిళ్లకే పరిమితం చేస్తున్నామన్నారు. మద్యం దుకాణాలకు కొన్నిచోట్ల అధిక అద్దెలు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, ఒక రూపాయికి అద్దెకు ఇచ్చిన వ్యక్తి ఎలా ఇచ్చారో కూడా పరిశీలిస్తామన్నారు. 
 
ఈ షాప్‌‌ల పక్కన జరిగే ఇతర వ్యాపారాలను కూడా పరిశీలిస్తామని, అద్దెలు సహేతుకం కాదని తేలితే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలు, ఆధ్యాత్మిక సంస్థలకు దగ్గరగా మద్యం షాప్‌లు వుండకూడదని నిర్ణయం తీసుకున్నామన్నారు. బార్‌లకు దూరంగా పెడుతున్నారనే ఆరోపణలను పరిశీలిస్తున్నామన్నారు. బార్‌ లకు దగ్గరగా ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎక్కడైనా ప్రజలు నిజంగా ముందుకు వచ్చి మద్యం దుకాణాలు వద్దని చెబితే వాటిని నిలిపివేస్తామన్నారు. 
 
రాజకీయ ఉద్దేశాలతో కొన్నిచోట్ల అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మద్యం ద్వారా వొచ్చే ఆదాయాన్ని, ఆదాయంగా చూడవద్దని సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. . గతంలో పర్మిట్‌ రూంలు వున్నప్పుడు అక్కడే మద్యం సేవించేవారని, వీటిని మేం పెట్టడం లేదన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మద్యం సేవించే అవకాశం లేదన్నారు. మీడియా సమావేశంలో ఎక్సైజ్‌ కమిషనర్ ఎంఎం నాయక్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ హరికుమార్‌, బేవరేజస్‌ ఎండి. వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.