గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2024 (15:07 IST)

తుంగభద్ర డ్యామ్‌ వద్దకు ఏపీ మంత్రి.. కొత్త గేటు ఏర్పాటుపై చర్చ

Tungabhadra Dam
Tungabhadra Dam
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌కు చేరుకుని క్రెస్ట్ గేట్‌లలో ఒకటి కొట్టుకుపోవడంతో తలెత్తిన పరిస్థితిని సమీక్షించారు.
 
కర్ణాటకలోని విజయనగరం జిల్లా హోస్పేట్ వద్ద డ్యామ్ వద్ద చేపట్టిన పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. కొత్త గేటు ఏర్పాటుపై ఇంజినీర్లు, నిపుణులతో మంత్రి మాట్లాడారు.
 
అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిపుణుల బృందం డ్యామ్ ఇంజినీర్లను పిలిపించి గేటు కొట్టుకుపోయిన చోట తాత్కాలికంగా ఏర్పాటు చేయడం, కొత్త గేటు ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలపై చర్చించారు. 
 
కాగా తుంగభద్ర డ్యాం 19వ గేటు ఆగస్టు 10వ తేదీ రాత్రి కొట్టుకుపోయింది. రిజర్వాయర్‌లో వరద తగ్గుముఖం పట్టడంతో క్రెస్ట్ గేట్లను మూసివేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత, విరిగిన గేటుపై ఒత్తిడిని తగ్గించేందుకు మొత్తం 33 క్రెస్ట్ గేట్లను తెరవాల్సి వచ్చింది.
 
ఆదివారం నీటి విడుదల లక్ష క్యూసెక్కులకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో ఫ్లోర్ అలర్ట్ ప్రకటించింది. డ్యాం అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రజలు నదిలో దిగువకు వెళ్లవద్దని కోరారు.