శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 31 జులై 2014 (10:13 IST)

ఆంధ్రప్రదేశ్‌లో 14వ జిల్లా.. పేరు అల్లూరి సీతారామరాజు!

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త జిల్లా ఏర్పాటుకానుంది. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ఏపీలో కలిసిన ఖమ్మంలోని ఏడు మండలాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు మండలాలు, తూర్పు గోదావరిలోని 10 మండలాలు కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఈ జిల్లాకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. దీనిపై ఆగస్టు 15వ తేదీన ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, 14వ జిల్లా ఏర్పాటు చేయడానికి ఏపీ సర్కార్ రెండు ప్రధాన కారణాలు చెబుతోంది. ఆ రెండు కారణాలు ఏంటంటే....
 
మొదటికారణం: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో... నాలుగు మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో, మూడు మండలాలను పశ్చిమగోదావరి జిల్లాలో కలపాలని ముందు అనుకున్నారు. అయితే ఇలా కలపడం వల్ల ఆ ఏడు మండలాలు... ఆ జిల్లా కేంద్రాలైన కాకినాడ, ఏలూరులకు చాలా దూరంలో ఉంటాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలు కూడా ఇప్పటికే ఆ జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్నాయి. 
 
జిల్లా ప్రధాన కేంద్రం దూరంగా ఉండడం వల్ల ఈ రెండు జిల్లాల్లోని గిరిజనులు బాగా ఇబ్బందిపడుతున్నారు. అందుకే ఖమ్మం జిల్లాలోని ఏడుమండలాలతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలను కలిపి ఓ కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి ఏపీ సర్కారు వచ్చింది. ఈ జిల్లా ఏర్పాటుతో గిరిజన ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలన్న ఆలోచనలో కూడా ఏపీ ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి.
 
రెండో కారణం: 13 సంఖ్యను ఏపీ ప్రభుత్వం కీడుకు సంకేతంగా భావిస్తోంది. ఈ సంఖ్య రాష్ట్రానికి ఏమాత్రం అచ్చిరాదని ఏపీ ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పశ్చిమదేశాల్లో కూడా వారి ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎక్కడా 13వ సంఖ్యను వాడరు. 13 సంఖ్యను వారు అశుభంగా భావిస్తారు. ఈ కారణంగా కూడా ఏపీలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని సర్కార్ యోచిస్తోంది.