బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (09:12 IST)

వైకాపా అభ్యర్థిని బెదిరించారనీ... అచ్చెన్నాయుడు అరెస్టు

పంచాయతీ ఎన్నికల నామినేషనే ప్రక్రియలో భాగంగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు నిమ్మాడలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. 
 
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిని అచ్చెన్నాయుడు బెదిరించారంటూ సోమవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన టీడీపీ కార్యకర్తలు నిమ్మాడలో ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలోని వాతావరణం ఉద్రిక్తంగా మారింది. 
 
మరోవైపు, ఈ అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే జగన్ ఇలాంటి పిరికిపంద చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట అని ఆరోపించారు.
 
నిమ్మాడలో అచ్చెన్నాయుడి ఇంటిపైకి రాడ్లు, కత్తులతో దాడికి వెళ్లిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, ఆయన అనుచరులపై పోలీసులు ఇప్పటి వరకు కేసెందుకు నమోదు చేయలేదని లోకేశ్ ప్రశ్నించారు. 
 
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లగుంటలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పుష్పవతిభర్త శ్రీనివాసరెడ్డిని హత్య చేశారని, ఇప్పుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని అన్నారు. ఎన్నికుట్రలు చేసినా  నియంత జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమని లోకేశ్ హెచ్చరించారు.