ఏపీకి రెయిన్ అలర్ట్.. మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించిదని తెలిపింది. పశ్చిమ దిశగా ఇది ప్రయాణించనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించినట్లు తెలిపింది.
రాయలసీమలో ఇవాళ, రేపు ఒకటిరెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురవనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక దక్షిణా కోసాంధ్రలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఎల్లుండి కూడా మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరకోస్తాంధ్ర, యానాంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.