శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Modified: సోమవారం, 28 జనవరి 2019 (19:53 IST)

ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాట సరసన చేరబోతోందా?

ఒకప్పటి ఆత్మగౌరవ నినాదం... తమిళనాడులో పుట్టి పెరిగిందే అయినప్పటికీ, తెలుగునాట కూడా ఒక ఊపు ఊపేసిందే. తద్వారానే తమిళనాడులో అయినా... తెలుగునాట అయినా చాలా సంవత్సరాలపాటు అధికారం సాగిందనేది నిర్వివాదాంశమే.
 
అయితే.. ఇప్పుడు సీన్ కాస్తా మారిపోయింది... తమిళనాడులో ఎన్నికలు వస్తున్నాయంటే మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలుకొని టీవీల వరకు ఉచిత సరఫరాల పేరిట ఊదరగొట్టేస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని నిబంధనల పేరిట ఆంక్షలు పెట్టి ఏదో ఇచ్చేసాము అని చేతులు దులుపేసుకొంటూంటే... ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒకప్పుడు ఎన్నికల ముంగిట రుణ మాఫీలనీ, అవనీ ఇవనీ ఊదరగొట్టేసి కొంతమందికి చేసేసి చాలామందికి అందజేసేసామని కూడా చెప్పుకొనేసారు...
 
అయితే ఇప్పుడు హామీలు కాస్తా మరింత ముందడుగు వేసి హామీ ఇచ్చే పార్టీ అధికారంలో ఉందా లేదా అనే దానిపై ఆధారపడి, సదరు పార్టీ అధికారంలో ఉన్నట్లయితే, తాయిలాలు ముందుగానే అందజేసేస్తున్నారు... అది డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పేరిట కావచ్చు... మొబైల్ ఫోన్ల పేరిట కావచ్చు... వెనుకబడిన వర్గాలకు ఉచిత విద్యుత్ సరఫరాలు కావచ్చు. ఏదేమైనా అసలు రాజధాని నిర్మాణానికే అష్టకష్టాలు పడుతున్న నేటి తరుణంలో కూడా ఇన్నిన్ని హామీలు అమలుకి నోచుకోవడం మాట దేవుడెరుగు అసలు వీటికి ఒక అంతూపొంతూ లేదా అనేదే నేటి ఓటరుకి మిగిలి ఉన్న సూటి ప్రశ్న.
 
ఈ ఉచిత సరఫరాలతో ఆంధ్రప్రదేశ్ కూడా ఎట్టకేలకు తమిళనాడు సరసన చేరబోతోంది... మరి అది అధికార పార్టీకి మంచే చేస్తుందో... లేక చేదు అనుభవాన్ని మిగుల్చుతుందో వేచి చూడాల్సిందే.