శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 2 జనవరి 2018 (11:51 IST)

కోడి పందేలు అలా వేసుకోండి... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని విషయాలను వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి గురించి ఇలా చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే... "జన్మభూమి – మా ఊరు కార్యక్రమం ఒక మహాయజ్ఞం. రాష్ట్రాభివృద్ధికి చేపట్ట

నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని విషయాలను వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి గురించి ఇలా చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే... "జన్మభూమి – మా ఊరు కార్యక్రమం ఒక మహాయజ్ఞం. రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన ఈ మహాయజ్ఞంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి.
 
2017 సంవత్సరం రాష్ట్రాభివృద్ధికి ఎంతో కలిసొచ్చింది. వండర్‌ఫుల్ ఇయర్. 2017లో ఎంతో ప్రగతి సాధించాం. 2018లో అంతకంటే ఎక్కువ ప్రగతి సాదిద్ధాం. దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళుతున్నాయి. జల హారతి వల్ల ఎంతో ప్రయోజనం కలిగింది. అనుకున్నరీతిలో వర్షాలు పడుంటే మరింత అభివృద్ధి సాధించేవాళ్లం.
 
భూగర్భ జలాల పెంపుదలకు తీసుకున్న చర్యలతో కరెంట్ వినియోగం తగ్గింది. దీనివల్ల రూ.200 నుంచి రూ.300 కోట్ల మేర ఆదా అయ్యింది. సేంద్రీయ వ్యవసాయం సాగుకు రైతుల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. దీనివల్ల గణనీయంగా రసాయినిక ఎరువుల వాడకం తగ్గింది. సేంద్రీయ వ్యవసాయం ద్వారా రైతులకు ఆర్థిక భారం తగ్గుతుంది.
 
ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 50 వేల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం సాగవుతోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్గానిక్ క్లస్టర్ గా ఏపీ అవతరిస్తోంది. సేంద్రీయ సాగు వల్ల వాతావరణం, ఆరోగ్యంపై ఎంతో మంచి ప్రభావం చూపుతుంది. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని దేశంలోనే తెలిపిన ఒకేఒక్క ప్రభుత్వం తమదే.
 
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరెంట్ లో మిగులు ఉత్పత్తి సాధించాం. సోలార్ విద్యుత్‌కు నాంది పలికాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎనర్జీ సెక్టార్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో జలహారతి నిర్వహించాం. ఈ నెలలో సూర్య ఆరాధన కార్యక్రమం చేపడుతున్నాం. సూర్యుడితో ప్రపంచానికి ఎంతో మేలుకలుగుతోంది.
 
కొందరు విగ్రహాల పేరుతో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. ఇటువంటి వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సమాజంలో అశాంతి సరికాదు. మనుషులు తోటివారిని గౌరవించడం అలవర్చుకోవాలి. ఈ భావన కులాలు, మతాలకతీతంగా అందరిలోనూ కలగాలి. జన్మభూమి-మా ఊరును అతిపెద్ద పండగగా జరుపుకుందాం. జన్మభూమి జరిగే పది రోజుల పాటు తమ కోసం, తమ గ్రామం కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
 
రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఏర్పడిన నవ్యాంధ్రలో కష్టాలను అధిగమించి, మొదటి ఏడాదిలోనే అన్ని ఇళ్లకూ కరెంట్ ఇవ్వగలిగాం. 100 శాతం మేర గ్యాస్ కనెక్షన్లు అందజేశాం. ఆత్మగౌరం పేరిట మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం. 14 నుంచి 15 వేల కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించాం. వీధుల్లో కారు చీకట్లను తొలగించి ఎల్.ఇ.డి బల్బులతో వెలుగులు నింపాం. 19 లక్షల ఇళ్లు పునాదుల దశలో ఉన్నాయి.
 
పేదలకు నాణ్యమైన ఇళ్లు నిర్మించి, వారికి ఆస్తి అందజేస్తున్నాం. వర్మి కంపోస్టు తయారీలో భాగంగా ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరిస్తున్నాం. జన్మభూమి లో 15.6 లక్షల మంది విద్యార్థులకు రూ.186 కోట్ల మేర బీమా స్కాలర్ షిప్పులు అందజేస్తున్నాం. 6 వేల క్లయిమ్ లకు రూ.120 కోట్లు చెల్లిస్తున్నాం. 4 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. లక్షా 50 వేల కార్డులు అందజేస్తున్నాం. వడ్డీలేని రుణాలు రూ.780 కోట్లు చెల్లిస్తున్నాం.
 
దేశంలో ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారం ఎంతో అవసరం. మనిషికి స్వార్థం కొంత మేర ఉంటే ఫర్వాలేదు. తమ గ్రామం, తోటి వారు నాశనమయ్యేటంత స్వార్థం ఉండకూడదు. అన్నింటికీ ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రజలంతా ఐక్యంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలి. జన్మభూమిలో జరిగే చర్చ కార్యక్రమాల్లో ఒక గంట పాటు ప్రజలంతా పాల్గొని, గ్రామాభివృద్ధిలో భాగమవ్వాలి. ఇందుకు జన్మభూమిక వేదికగా ఉంటుంది.
 
సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కోడి పందాలు ఆడొద్దు అని చెప్పడం లేదు. కోళ్ల కాళ్లకు కత్తుల కట్టకుండా పందాలు ఆడొచ్చు. అదే సమయంలో అది జూదంగా మారకూడదు. సమాజం బాగుంటే అందరమూ బాగుంటాం."