శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2024 (17:40 IST)

చెన్నై.. కృష్ణపట్నం ఓడరేవులు.... ఆధ్యాత్మిక నగరం మధ్య ఉండే శ్రీసిటీన ది బెస్ట్ ఎకనామిక్ జోన్

chandrababu naidu
ఒకవైపు చెన్నై పోర్టు, మరోవైపు కృష్ణపట్నం ఓడరేవు, ఇంకోవైపు తిరుపతి వంటి ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక నగరం... ఈ మూడింటికీ అతి దగ్గరగా ఉన్న శ్రీసిటీని అత్యుత్తమ ఎకనామిక్ జోన్‍గా చేయాలన్నది మా ఆలోచన అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆయన సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని పరిశ్రమలకు శంకుస్థాపనలు చేయగా, నెలకొల్పిన మరికొన్ని పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తర్వాత ఆయన ఆయా కంపెనీల సీవీవోలతో కీలక సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారన్నారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, ఈ సంపద సంక్షేమానికి దోహదం చేస్తుందని చెప్పారు. '1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించాను. భారత్‌ను ఐటీ.. ప్రపంచ పటంలో నిలుపుతుందని ఆనాడే చెప్పాను. గతంలో పీపీపీ విధానంలో హైటెక్‌ సిటీ చేపట్టాను. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారు. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారు. ఇందులోని ప్రతి నలుగురిలో ఒక ఏపీ వ్యక్తి ఉంటారు. 
 
శ్రీసిటీలో 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. సెజ్‌, డొమెస్టిక్‌ జోన్‌, ఫ్రీట్రేడ్‌ జోన్‌లు వచ్చాయి. 220 కంపెనీల ఏర్పాటుకు ఇక్కడ అవకాశం ఉంది. ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యాం. ఆటోమేటివ్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలు వచ్చాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. 4.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు, 4 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు సాధించడం చాలా గొప్ప విషయం' అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 
 
మరోవైపు, చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీసిటీ దగ్గరగా ఉందని చంద్రబాబు గుర్తుచేశారు. శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్‌ జోన్‌గా తయారు చేయాలనేది తన ఆలోచనన్నారు. 'శ్రీసిటీ ఐజీబీసీ గోల్డెన్‌ రేటింగ్‌ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నాం. పచ్చదనం కోసం వందశాతం వర్షం నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటాం. శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తాం. సహజంగా చల్లనివాతారవణం కల్పనకు చర్యలు తీసుకుంటాం. వీలైనంత వరకు ఉత్పత్తి, లాజిస్టిక్‌ ధరలు తగ్గించుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుందని తెలిపారు. 
 
కొత్త రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతున్నాం. రాజధాని కోసం 29వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇంటింటికీ నీరు, విద్యుత్‌, ఫైబర్‌ నెట్‌ అందిస్తున్నాం. గ్యాస్‌ మాత్రమే కాకుండా ఏసీ కూడా పైప్‌లైన్ల ద్వారా తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నాం. పరిశ్రమలు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని కోరుతున్నా. 2029 నాటికి భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. విజన్‌ 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. 2047 నాటికి ఒకటి లేదా రెండు స్థానాల్లో భారత్‌ నిలుస్తుంది అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.