శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

అమరావతి అభివృద్ధిపై బాబు దృష్టి : తలమానికంగా ఇన్నర్ రింగ్ రోడ్డు!

amaravati capital
ఏపీలో కొత్తగా ఏర్పాటైన ఎన్డీయే కూటమి ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులోభాగంగా, అమరావతి నగరానికే తలమానికంగా ఉండేలా ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించనుంది. విజయవాడ తూర్పు బైపాస్‌కి ఎడంగా, కనీసం 20 కిలోమీటర్ల దూరం నుంచి ఐఆర్ఆర్ వెళ్లేలా ఎలైన్మెంట్ సిద్ధం చేయనుంది. ఇందుకు సంబంధించి భూసేకరణ విధానంలోనూ మార్పుల దిశగా యోచిస్తోంది.
 
గత టీడీపీ హయాంలో సుమారు 180 కిలోమీటర్ల అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుతో పాటు, సుమారు 97.5 కిలోమీటర్ల పొడవైన ఇన్నర్ రింగు రోడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అమరావతి, విజయవాడ చుట్టూ.. తాడేపల్లి, మంగళగిరిలతో పాటు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు ఐఆర్ఆర్ లోపలికి వచ్చేలా ప్లాన్స్ సిద్ధం చేశారు. ఆ తర్వాత ఈ అంశాలకు బ్రేక్ పడింది.
 
భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాలు కలిసిపోయి మహానగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక అమరావతి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలూ వేగంగా అభివృద్ధి బాటన సాగుతుండటంతో భవిష్యత్తు అవసరాలకు ఐఆర్ఆర్ అవసరమేనని ప్రభుత్వం అంచనాగా ఉంది.
 
ఇక అమరావతి, విజయవాడ నగరాల చుట్టూ 8 వరుసల ప్రధాన రహదారి, నాలుగు వరుసల సర్వీసు రోడ్డుతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు మూడు ఎలైన్ మెంట్లు గతంలో సిద్ధం చేశారు. ఫుట్పాత్ పాటు సైకిల్ ట్రాక్ను కూడా ప్లాన్ చేశారు. వీటిల్లో రూ. 6,878 కోట్ల అంచనా వ్యయం ఉన్న రెండో ప్రతిపాదనను దాదాపుగా ఖరారు చేశారు. ప్రాజెక్టును ఫేజ్ 1, ఫేజ్ 2గా విభజించి అంచనాలూ రూపొందించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ఐఆర్ఆర్పై దృష్టి సారించింది.