గురువారం, 2 అక్టోబరు 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (22:22 IST)

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

Saibaba
ప్రవాస భారతీయులంతా వికసిత్ భారత్ రన్‌లో కలిసి అడుగులు వేసి జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టారు. భారతీయ అమెరికన్ కమ్యూనిటీ, న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ మద్దతుతో న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు ఆలయం సాయిదత్త పీఠం ఈ రన్‌ను ఘనంగా నిర్వహించింది. ఎడిసన్‌లోని ఓక్ ట్రీ రోడ్‌లోని ఆలయ పార్కింగ్ ప్రాంగణం నుంచి రన్ ప్రారంభమై, భారత ఐక్యత, ప్రగతిని ప్రతిబింబించింది. భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా చేస్తున్న చారిత్రక ప్రయాణాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది. ప్రవాస భారతీయుల ఉత్సాహం పరవళ్ళు తొక్కింది. 
 
భారత్-అమెరికా మైత్రిని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ రన్ ఒక వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి న్యూయార్క్ నుండి డిప్యూటీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా విశాల్ జయేష్ భాయ్ హర్ష్, న్యూ జెర్సీ మాజీ డిప్యూటీ స్పీకర్, కమీషనర్ ఎమిరిటస్ ఉపేంద్ర చివుకుల, సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు మందిరం చైర్మన్ రఘుశర్మ శంకరమంచి, కమ్యూనిటీ లీడర్స్ కృష్ణా రెడ్డి అనుగుల, విలాస్ జంబుల, దాము గేదెల, తానా, ఆట, నాట్స్, టీటీఏ,  మాటా, టీఫాస్, హెచ్ఎస్ఎస్, ఇండో అమెరికన్ సంస్థతో పాటు, పలు స్థానిక, జాతీయ ప్రవాస భారతీయ సంస్థలను కలుపుకుని సాయిదత్త పీఠం ఈ రన్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. విశాల్ హర్ష్, కృష్ణా రెడ్డి, ఉపేంద్ర, గోపి ఆచంట, మోహన్ దేవరకొండ, శ్రీనివాస్ భర్తవరపు, శ్రీహరి మందాడి, సంతోష్ కోరం, కిరణ్ దుద్దిగ, శ్రీకాంత్, అశ్విన్ గోస్వామి, కల్పనా శుక్లా తదితరులు పాల్గొన్నారు. 
 
Viksit Bharat Run
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న ఫిట్ ఇండియా, స్టార్ట్‌అప్ ఇండియా, మేక్-ఇన్-ఇండియా కార్యక్రమాలు, డిజిటల్ ఇండియా, UPI వంటి సాంకేతిక విప్లవాలు, భారత్-అమెరికా మైత్రి బలోపేతం, అలాగే వికసిత్ భారత్‌లో ప్రవాస భారతీయుల కీలక పాత్ర వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రశంసించారు. వికసిత భారత్‌‌లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంత కీలకం అనేది ఈ రన్ ద్వారా చాటి చెప్పింది. 
 
ఈ సందర్భంగా విశాల్ హర్ష్ దేవాలయ ప్రాంగణం లోని పూదోటలో ఒక ఎవర్గ్రీన్ మొక్కను కూడా నాటారు. ఈ కార్యక్రమానికి పలువురు మహిళలు కూడా విచ్చేశారు. సాయిదత్త పీఠం ఉదయాన్నే అందరికీ అల్పాహారాన్ని అందించింది. వికసిత్ భారత్ టీ-షర్ట్స్ ను కూడా నిర్వాహకులు అందించారు. ప్రీతి, నీలిమ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.