1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 17 జనవరి 2015 (14:01 IST)

నారావారి ఆదర్శం: 3 గ్రామాలను దత్తత తీసుకున్న బాబు ఫ్యామిలీ!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ 3 గ్రామాలను దత్తత తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆరంభించిన సంసద్ ఆవాస్ యోజన (మోడల్ విలేజ్) కింద ఎంపీలు గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. దత్తత తీసుకున్న ఆయా గ్రామాలను ఎంపీలు ఏడాదిలోగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సి ఉంది. 
 
ఈ మోడల్ విలేజ్ పథకం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబాన్ని కూడా ఆకర్షించినట్లుంది. ఈ క్రమంలో చంద్రబాబు మినహా బాబు సొంత గ్రామం నారావారిపల్లెను ఆయన కోడలు బ్రాహ్మణి దత్తత తీసుకోగా, చంద్రబాబు భార్య భువనేశ్వరి తన తల్లిగారి పుట్టిల్లు కొమురోలును దత్తత తీసుకున్నారు. ఇక చంద్రబాబు తనయుడు నారా లోకేశ్... తన తాత, దివంగత నేత ఎన్టీ రామారావు సొంతూరు నిమ్మకూరును దత్తత తీసుకున్నారు. 
 
గ్రామాలను అభివృద్ధి చేయాలంటే ప్రజాప్రతినిధులే కావాల్సిన అవసరం లేదన్న రీతిలో వారు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెకు వెళ్లిన నేపథ్యంలో చంద్రబాబు కుటుంబం గ్రామాలను దత్తత తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.