ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 16 జూన్ 2019 (15:59 IST)

డిప్యూటీ సీఎం శ్రీవాణికి తప్పిన ముప్పు.. వైకాపా నేత కాలు ఫ్రాక్చర్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి పెనుముప్పు తప్పింది. ఆమె ఎక్కిన వేదిక ఒక్కసారి కుప్పకూలిపోవడంతో ఆమె ఒకవైపునకు పడిపోయారు. అదే వేదికపై ఉన్న వైకాపా పార్టీ సీనియర్ డాక్టర్ పీవీవీ సూర్యనారాయణ రాజు (సురేష్ బాబు) కుడి కాలికి ఫ్రాక్చర్ అయింది. 
 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అదేసమయంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించుకున్నారు. వీరిలో ఒకరు పుష్ప శ్రీవాణి. ఈమెకు గిరిజన సంక్షేమ శాఖామంత్రిగా నియమిస్తూనే ఉప ముఖ్యమంత్రి హోదాను కల్పించారు. 
 
ఈ క్రమంలో నవ్యాంధ్ర ఉప ముఖ్యమంత్రిగా.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు చేరుకున్న పాముల పుష్పశ్రీవాణికి ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలోనే ఆమెకు పెద్దముప్పు తప్పింది. జిల్లా సరిహద్దు ప్రాంతం భోగాపురం మండలం రాజాపులోవ వద్దకు ఉదయం 10 గంటలకు ఆమె చేరుకోగానే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. అందరూ శుభాకాంక్షలు తెలియజేశాక ఆమె ప్రసంగించేందుకు వేదికపైకి ఎక్కారు. కొద్ది క్షణాలు మాట్లాడాక వేదికపై నుంచి కిందికి దిగేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఉన్నఫళంగా ఆ వేదిక కుప్పకూలిపోయింది. 
 
దీంతో వేదికపై ఉన్న మంత్రి ఒకవైపుకు పడిపోగా, మరోవైపు కూలిపోయింది. వెంటనే పోలీసులు, నాయకులు పరుగున చేరుకుని ఆమెను కారు వద్దకు తీసుకెళ్లారు. మంత్రికి ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. స్టేజ్‌పై ఉన్న వైసీపీ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు కుమారుడు డాక్టర్‌ పీవీవీ సూర్యనారాయణరాజు(సురేష్‌ బాబు) కుడి కాలికి ఫాక్చర్‌ అయింది.