సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 9 జూన్ 2019 (18:30 IST)

శ్రీవారి పాదాల సాక్షిగా ఏపీ హామీల ఊసెత్తని నరేంద్ర మోడీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల వెంకన్న దర్శనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం వచ్చారు. దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ఆయన ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుని అక్కడ నుంచి తొలుత బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు.
 
అంతకుముందు తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. తొలుత "భారత్ మాతాకి జై అంటూ ప్రారంభించి "ఓం నమో వేంకటేశాయ సదా వెంకటేశం స్మరామి స్మరామి" అంటూ తెలుగులోనే స్వామి వారి స్త్రోతం పఠించారు. బాలాజీ పాదాలు, పద్మావతి సాక్షిగా మళ్లీ తమకు అధికారం ఇచ్చిన ప్రజలందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని, 'స్వామికి నా ప్రణామాలు' అంటూ ఆయన పేర్కొన్నారు. 
 
ఆ తర్వాత ఆయన హిందీలో ప్రసంగించగా, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి దాన్ని తెలుగులోకి అనువదించారు. శ్రీలంక నుంచి నేరుగా ఇక్కడికి రావడంలో కొంత ఆలస్యం జరిగిందని, అందుకు తనను క్షమించాలని కోరారు. తిరుపతికి అనేకసార్లు వచ్చే అదృష్టం తనకు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. వేంకటేశ్వరుడి సన్నిధిలో తల వంచి ఆశీస్సులు తీసుకుందామని ఇక్కడికి వచ్చానని, దేవ దేవుని దర్శనానికి వెళ్తూ ప్రజా దేవుళ్లను సందర్శించే భాగ్యం తనకు లభించిందని మోడీ వ్యాఖ్యానించారు. 
 
నవ్యాంధ్రలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరికీ అభివృద్ధిఫలాలు అందాలన్న కృషితో తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నవ భారత్ నిర్మాణానికి కేంద్ర రాష్ట్రాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో జగన్ రెడ్డి సారథ్యంలో బలమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, ఈ రెండు నవ్యాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తాయన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. అయినప్పటికీ కార్యకర్తలు ఎంతగానో పని చేశారనీ, వారి కృషి ఫలితంగానే పార్టీ ఈ స్థాయికి వచ్చిందని ప్రధాని మోడీ గుర్తుచేశారు. ఈ సమావేశంలో మోడీ ఎక్కడ కూడా నవ్యాంధ్ర హామీలను ప్రస్తావించలేదు. 
 
అంతకుముందు.. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న నరేంద్ర మోడీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్, డీజీపీ సవాంగ్, రాష్ట్ర మంత్రులు, బీజేపీ నేతలు, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.