నాడు తండ్రి కేబినెట్‌లో నేడు కొడుకు మంత్రివర్గంలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పూర్తిగా తనదైనశైలిలో ఆయన తన మంత్రివర్గం కూర్పు చేసుకున్నారు. మొత్తం 25 మంది మంత్రుల్లో ఆరుగురు మంత్రులు అందరికంటే అదృష్టవంతులని చెప్పాలి.
ఆ ఆరుగురు మంత్రులు ఎవరో కాదు.. సీనియర్ నేతలైన పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విశ్వరూప్, బాలినేని శ్రీనివాస రెడ్డిలు జగన్ తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో కూడా పని చేశారు. వీరంతా ఇపుడ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకున్నారు. పైగా, వీరికి అత్యంత కీలక శాఖలను ముఖ్యమంత్రి జగన్ కేటాయించడం గమనార్హం.
వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖను కేటాయించగా, బొత్సకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను, మోపిదేవి వెంకటరమణకు మత్స్య, పశుసంవర్ధకశాఖ, మార్కెటింగ్ శాఖలను కేటాయించారు.
అలాగే, పినిసె విశ్వరూప్‌కు సాంఘిక సంక్షేమ శాఖ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖలు, బాలినేని శ్రీనివాసరెడ్డికి విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు దక్కాయి.