శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 8 జూన్ 2019 (12:37 IST)

మీరు అలా ఉన్నందుకు నేను తప్పుపట్టను : సీఎం జగన్

గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉన్న సచివాలయ ఉద్యోగులను తాను తప్పుపట్టడం లేదని నవ్యాంధ్ర కొత్త ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం ఉదయం వెలగపూడిలోని సచివాలయానికి తొలిసారి వచ్చారు. ముందు తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు, వేదపండింతుల ఆశీర్వచనాలు తీసుకున్న జగన్.. ఆ తర్వాత ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం జరిపారు. ఆ తర్వాత సచివాలయ ఉద్యోగులతో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉండడం సహజమని, దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. ఏ ప్రభుత్వంలోనైనా సీఎంతో సన్నిహితంగా ఉండాలని ఉద్యోగులు కోరుకుంటారన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న వారినీ తాను తప్పుపట్టనని చెప్పారు. మా ప్రభుత్వంలో చిత్తశుద్ధితో సేవలందించి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు మీ వంతు సహకారం అందించాలని కోరారు.
 
ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇస్తామని ప్రకటించారు. అలాగే సీపీఎస్ రద్దు విషయంలో రేపు జరిగే మంత్రవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు. అలాగే, సచివాలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించాలంటే అందరు ఉద్యోగుల సహకారం అవసరమన్నారు. అందరూ కలిసి ప్రజలకు మెరుగైన పాలన అందిద్దామని పిలుపునిచ్చారు.