శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 9 జూన్ 2019 (11:05 IST)

జగన్‌పై అలిగిన రోజమ్మ... అక్కడకు డుమ్మా.. కీలక పదవి ఇచ్చే దిశగా...

వైకాపా అధినేత, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డిపై చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే. రోజా అలకబూనారు. వరుసగా రెండుసార్లు గెలిచిన తనకు మంత్రి పదవి ఖాయమని ఆమె భావించారు. కానీ, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆమెను జగన్ పక్కనబెట్టారు. పైగా, చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. దీంతో ఆమెకు మొండిచేయి చూపక తప్పలేదు. 
 
దీంతో జగన్‌పై ఆమె అలక బూనారు. ఫలితంగా శనివారం ఉదయం వెలగపూడిలో జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరుకాలేదు. ఈ విషయం జగన్‌ దృష్టికి చేరింది. దీంతో ఆయన ఆమెకు సముచిత స్థానం కల్పించాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
 
అయితే, రోజా ఓ ఎమ్మెల్యేగా ఉన్నారు. అందువల్ల ఆమెకు ఈ పదవిని అప్పగించవచ్చా? అన్న విషయమై ఆయన అడ్వొకేట్ జనరల్ సలహాను కోరినట్టు వినికిడి. మామూలుగా అయితే, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నవారు పార్టీలకు అతీతంగా ఉండాలి. ప్రస్తుతం ఈ పదవిలో నన్నపనేని రాజకుమారి కొనసాగుతున్నారు. ఆమె స్థానంలో రోజా నియామకానికి లీగల్ చిక్కులు అడ్డుకాకుంటే, అతి త్వరలోనే నియామకపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.