మాట తప్పిన సీఎం జగన్.. విశ్వసనీయతపై నెటిజన్ల ట్రోలింగ్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ఇచ్చిన మాట తప్పారు. ఫలితంగా ఆయన విశ్వసనీయత మంటగలిసిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అంశంపై నవ్యాంధ్రలో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ చర్చకు జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న కొత్త మంత్రివర్గమే కారణం. ఈ మంత్రివర్గంలో ఆయన మాట ఇచ్చిన ఒక్కరికీ కూడా మంత్రిపదవి ఇవ్వలేదు. దీంతో ఆయన మాట తప్పారన్న ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
ముఖ్యంగా, మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేశారు. ఈయనపై వైకాపా అభ్యర్థిగా ఆళ్ళ రామకృష్ణా రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. లోకేశ్‌ను ఓడిస్తే మంత్రిపదవి ఇస్తానని ఆర్కేకు జగన్ ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు. తీరా మంత్రివర్గంలో ఆయనకు మొండిచేయి చూపించారు.
అలాగే, గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి ఆశించి, విఫలమైన మర్రి రాజశేఖర్ విషయంలోనూ అదే జరిగింది. చిలకలూరిపేట అసెంబ్లీ టికెట్‌ను కొన్ని కారణాలతో విడదల రజనికి ఇవ్వాల్సి వచ్చిందని, ఓటర్లు ఆమెను గెలిపించాలని, ఇక్కడి స్థానిక నేత రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీని చేస్తానని కూడా జగన్ హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలనూ జగన్ నెరవేర్చలేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా, తమకు మంత్రి పదవులు రాకపోవడంపై అటు ఆళ్లగానీ, ఇటు మర్రిగానీ ఏ విధమైన వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. ఈ రెండు విషయాల్లో జగన్ మాట తప్పారనే విషయం తేటతెల్లమవుతోంది. తాను మాట ఇస్తే మాట తప్పనని జగన్ పదేపదే చెబుతుంటారు. కానీ, జగన్ మాత్రం ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత గతంలో ఇచ్చిన హామీలను విస్మరించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.