సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 9 జూన్ 2019 (13:40 IST)

జగన్ మంత్రివర్గంలో ఫైర్‌బ్రాండ్లకు చోటేది?

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పారదర్శకమైన పాలన అందించేందుకు వీలుగా ఆయన తనకు అనుకూలంగా ఉండేవారిని మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే, గత పదేళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని, గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలుపడుతూ, పార్టీ గొంతుకను వినిపించి ఫైర్‌బ్లాండ్లుగా పేరుబడిన వారిలి ఏ ఒక్కరికీ కూడా జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. దీనిపై సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
నిజానికి జగన్ మోహన్ మంత్రివర్గంలో సామాజిక న్యాయానికి పెద్దపీటవేశారు. అయినప్పటికీ తమకు మంత్రిపదవి దక్కుతుందని గట్టి నమ్మకం పెట్టుకున్న వారికి మాత్రం నిరాశే ఎదురైంది. ఇలాంటివారంతా పార్టీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. 
 
వీరిలో ముందుకు చెప్పుకోవాల్సింది నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా. ఈమెకు మంత్రి పదవి ఖాయమని, కీలక శాఖ దక్కుతుందని ఎంతో ప్రచారం జరిగింది. కానీ, ఆమెను జగన్ తీసుకోలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, ఆపై జగన్‌కు ఎంతో నమ్మకస్తులుగా ముద్రపడ్డ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలకూ మంత్రి పదవులు లభించలేదు.
 
అయితే, కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పదవి, చెవిరెడ్డికి విప్‌ పదవి, తుడా (తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) ఛైర్మన్ పదవి, కొరుముట్ల శ్రీనివాసులుకి విప్‌ పదవి లభించాయి. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి మాజీ స్పీకర్ కోడెలపై విజయం సాధించిన అంబటి రాంబాబుకు కూడా నిరాశే మిగిలింది. 
 
కర్నూలు జిల్లా నుంచి శిల్పా కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగినా, అది వాస్తవ రూపం దాల్చలేదు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు పదవులు ఖాయమని భావించినా, జగన్ వారిని తన మంత్రివర్గంలోకి తీసుకోలేదు.