శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 9 డిశెంబరు 2021 (16:17 IST)

ఏపీ ఉద్యోగుల‌కు 30-32 శాతం పీఆర్సీ! సంఘాల్లో చీలిక‌!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి... ఉద్యోగుల‌కు పి.ఆర్.సి. ప్ర‌క‌టించ‌లేని స్థితిలో ఉండ‌టం, రాజ‌కీయ క‌ల‌క‌లం రేపుతోంది. పి.ఆర్.సి. నివేదిక ఎందుకు ర‌హస్యంగా ఉంచార‌ని ఉద్యోగ సంఘాల నాయ‌కులు, రాజ‌కీయ నాయ‌కులు నిత్యం విమ‌ర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏది చేసినా వ్యూహాత్మ‌కంగానే ఉంటుంది. ఈ పిఆర్సీపై త‌స్మ‌దీయుల‌కు లీకులు కూడా వ‌చ్చేశాయి. 
 

రాష్ట్ర ప్రభుత్వం సుమారు 30 నుంచి 32 శాతం పీఆర్సీ ఇవ్వడానికి సిద్ధమవుతోంద‌ని సమాచారం. ఇది ఇస్తార‌ని వైసీపీకి అనుకూలంగా ఉన్న యూనియన్లకు లీకులు కూడా వ‌చ్చేశాయి. ప్రభుత్వం సుమారు 30  శాతం పీఆర్సీ ఇవ్వడానికి సిద్ధమవుతోంద‌ని, పాత హెచ్.ఆర్.ఏ నే కొనసాగించే అవకాశం కూడా ఉంద‌ని చెపుతున్నారు. ఇదే విషయాన్ని వెంకట్రామిరెడ్డి యూనియన్ త‌మ అనుకూల యూనియన్లకు, ఉద్యోగులకు చెప్పి, ఆందోళనలకు మద్దతు ఇవ్వవద్దని పిలుపు ఇచ్చింద‌ట‌. దీనితో మెజార్టీ ఉద్యోగులు ఆందోళనకు దూరంగా ఉన్నారు. 
 

ఏపీ రాష్ట్ర గ్రంథాలయ సంఘం, ట్రెజరీ ఉద్యోగుల సంఘం నిరసనలకు దూరంగా ఉన్నాయి. అంతా క‌లిపి ఉద్య‌మం చేయ‌లేని ఉద్యోగ సంఘాల తీరును చూస్తే, మొత్తం మీద ఉద్యోగులను విభజించి, పాలించ‌డంలో జ‌గ‌న్ ప్రభుత్వం పైచేయిని సాధించింది. దీనికి తోడు ప్రభుత్వం రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా ఉంద‌ని, సంఘ నాయకుల ప్రతి కదలిక ఇంటిలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరిపోతుంద‌ని స‌మాచారం.
 
 
పి.ఆర్.సి. విష‌యంలో, ఇత‌ర స‌మ‌స్య‌లపైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చీలిపోయిన‌ట్లు క‌నిపిస్తోంది. ప్రతి ప్ర‌భుత్వ శాఖ‌లోనూ పోటాపోటీగా కార్యవర్గాలు ఏర్పడ్డాయి. గత రెండున్నర సంవత్సరాలుగా ఒక్కో శాఖలో గుర్తింపు పొందిన యూనియన్ కు పోటీగా ఒక ప్రధాన సామాజికవర్గం ఉద్యోగులతో పోటీ సంఘం ఏర్పాటు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విజ‌యం సాధించింది. దూరదృష్టితో ప్రభుత్వంలోని పెద్దలు దీనికి స్కెచ్ వేయడం, అందుకు అనుగుణంగా పోటీ సంఘాల‌ ఏర్పాటుతో ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల్లో బలమైన చీలిక వ‌చ్చేసింది. .
 

పీఆర్సీ, మరో 71 సమస్యలపై ఉద్యోగ సంఘాలు మంగళవారం నుంచి దశల వారీ ఆందోళనకు పిలుపు ఇచ్చినా, ప్రభుత్వ ఉద్యోగుల్లో నల్లబ్యాడ్జీలు ధరించిన వారు నామమాత్రమే. అంటే మెజార్టీ ఉద్యోగులు దశాలవారీ ఆందోళనకు దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల్లో 147 సంఘాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బండి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ ఎన్జీవో  సంఘానికి, ఏపీ సెక్రెటరీయేట్ ఫెడరేషన్ (వెంకట్రామిరెడ్డి), ప్రభుత్వ ఎంప్లాయిస్ అసోషియేషన్ (సూర్యనారాయణ)ల‌కు  గుర్తింపు ఉంది. బొప్పరాజు నేతృత్వంలో నడుస్తున్న అమరావతి జేఏసీకు గుర్తింపు లేదు.
 

ఏపీ ఎన్జీవో అసోషియేషన్ ప్రధానమైన అసోషియేషన్ అయినా, దీనికి అనుబంధంగా 106 సంఘాలున్నాయి. వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో ని సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ కు 95 సంఘాలు, ఎంప్లాయిస్ అసోషియేషన్ కు 60 సంఘాల‌ మద్దతు ఉందని స‌మాచారం. వెంకట్రామిరెడ్డి వైసీపీ ప్రభుత్వ ఆశీస్సుల‌తో సంఘాన్నిఏర్పాటు చేయడం, దానికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడంతో స్వ‌ప‌క్షంగా నిలిచింది.


పీఆర్సీపై దశల వారీ ఆందోళనకు వెంకట్రామి రెడ్డి మద్దతు లేదంటే, సచివాలయంలో 3,500 ఉద్యోగుల  ఆందోళనకు మద్దతు లేన‌ట్లే. పీఆర్సీ కోసం ఆందోళనకు నడుంబిగించిన బొప్పరాజు, బండి శ్రీనివాసరావుల వెంట బలమైన సంఘాలు లేకుండా చేయడంలో వైసీపీ ప్రభుత్వం సఫ‌లం అయింది. అలాగే ఒక్కో శాఖలో పోటీ యూనియన్ వైసీపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్న సామాజికవర్గం ఏర్పాటు చేయడం కూడా ఆయా సంఘాలు ఆందోళనలో పాల్గొనడం లేదు. దీనితో ఏపీ ఎన్జీవోల నిర‌స‌న‌లు నీరుగారిన‌ట్లే అని భావిస్తున్నారు.