రోగ నిరోధక శక్తిని తప్పించుకుంటూ... 4 రెట్లు స్పీడ్ గా ఒమిక్రాన్!
ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఒకవైపు ప్రపంచ దేశాలకు విస్తరిస్తుండగా, మరోవైపు దాని వ్యాప్తి వేగం, తీవ్రత, టీకాల సమర్థతపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయి పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా జపాన్ శాస్త్రవేత్త చేసిన ఓ అధ్యయనంలో కొత్త అంశం వెల్లడైంది. ఒమిక్రాన్ ప్రారంభ దశలో డెల్టా వేరియంట్ కంటే 4.2 రెట్లు ఎక్కువ వేగంతో వ్యాపిస్తున్నట్లు తేలింది. క్యోటో విశ్వవిద్యాలయంలో ఆరోగ్య, పర్యావరణ శాస్త్రాల ప్రొఫెసర్‌గా పని చేస్తున్న హిరోషి నిషియురా దక్షిణాఫ్రికా గౌటెంగ్ ప్రావిన్స్‌లో నవంబర్ వరకు అందుబాటులో ఉన్న జన్యు సమాచారాన్ని విశ్లేషించి, ఒమిక్రాన్ వ్యాప్తిపై సమచారాన్ని అందించారు.
ఒమిక్రాన్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. సహజ, వ్యాక్సిన్‌ల ద్వారా సమకూరిన రోగనిరోధక శక్తినీ ఇది తప్పించుకుంటుంది అని నిషియురా విశ్లేషించారు. ఈ సమాచారాన్ని ఆయన దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా మండలికి సమర్పించారు. ఆరోగ్యశాఖకు సలహాదారుగా ఉన్న ఆయన గణిత సూత్రాల ఆధారంగా అంటువ్యాధుల వ్యాప్తి అంచనాలో నిపుణుడు. దక్షిణాఫ్రికాలో టీకా రేటు 30 శాతం కంటే తక్కువగా ఉంది. దీంతో అక్కడ చాలా మందికి సహజంగానే వైరస్ సోకి ఉంటుంది. అయితే అధిక వ్యాక్సినేషన్ రేటు ఉన్న దేశాల్లోనూ ఇలాగే జరుగుతుందా? అని తేలేందుకు మరికొంత సమయం పడుతుందని నిషియురా పేర్కొన్నారు.