1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (14:20 IST)

వలంటీర్లకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు.. భూమిలేనివారికి పింఛను

ysjagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వలంటీర్లకు ఏపీ సర్కారు శుభవార్త చెప్పింది. అమరావతిలో భూమిలేని వలంటీర్ల తల్లిదండ్రులకు నెలవారీ పింఛను ఇవ్వనున్నట్టు వెల్లడించింది. నెలకు రూ.2500 చొప్పున మార్చి ఒకటో తేదీ నుంచి ఈ పింఛను మొత్తాన్ని అందించనున్నట్టు ప్రకటించింది. అయితే, వైకాపా ప్రభుత్వం నియమించిన వలంటీర్లదరికీ ఇది వర్తించకుండా ఒక షరతు విధించింది. 
 
అమరావతి భూమిలోని నిరుపేద వలంటీర్ల తల్లిదండ్రులకు నెలకు రూ.2500 పింఛను ఇస్తున్నారు. ఇకపై అమరావతి గ్రామాల వలంటీర్లకు కూడా ఈ పింఛను ఇవ్వనున్నారు. దీనికి ఏపీ సర్కారు సమ్మతం తెలిపింది. మార్చి ఒకటో తేదీ దీన్ని అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. 
 
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 200కు పైగా అమరావతి పరిసర గ్రామాల్లో పని చేసే వలంటీర్లు పని చేస్తున్నారు. వీరందరి తల్లిదండ్రులకు ఈ పెన్షన్ ఇవ్వనున్నట్టు రాష్ట్ర మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి గురువారం వెల్లడించారు. 
 
ఇటీవల శ్రీలక్ష్మి అమరావతి గ్రామాలలో పర్యటించారు. ఈ సమయంలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వాలంటీర్లు తమకు కూడా పెన్షన్‌ ఇవ్వాలని శ్రీలక్ష్మిని అభ్యర్థించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే శ్రీలక్ష్మి దీనిపై సానుకూలంగా స్పందించి.. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం జగన్‌కు ఈ సమస్యను వివరించగా.. ఆయన సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు.
 
అమరావతి గ్రామాలకు చెందిన నిరుపేద వాలంటీర్ల కుటుంబాలకు పింఛన్లు అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. మార్చి 1 నుంచి ప్రతి నెలా భూమి లేని నిరుపేద గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు పింఛ‌ను రూ.2,500 మంజూరు ఇస్తారు. ఈ నిర్ణయంపై వాలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.