గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

సీఎం జగన్ సర్కారుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

kotamreddy
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వైకాపా రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రిటర్న్ గిప్ట్ ఇచ్చారు. తనకు ప్రభుత్వం కేటాయించిన నలుగురు గన్‌మెన్లలో ఇద్దరిని ప్రభుత్వం తగ్గించింది. దీంతో ఆగ్రహించిన ఆయన మరో ఇద్దరు గన్‌మెన్లను కూడా వెనక్కి పంపించేశారు. అంటే ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మనకు బహుమతి ఇచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కనీస మర్యాద, సంస్కారమన్నారు. తనది ప్రజల గొంతుకత అని, తన స్వరం రోజురోజుకూ పెరుగుతుందేగానీ తగ్గదన్నారు. భద్రత తగ్గినంతమాత్రాన తాను బలహీనపడనని తేల్చి చెప్పారు. ప్రజల పక్షానే నిలబడతానని స్పష్టం చేశారు. 
 
తనకు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అదనపు భద్రత కల్పించాల్సింది పోయి నలుగురిలో ఇద్దరు గన్‌‍మెన్లను వెనక్కి పిలిపించుకోవడం ఏమిటని ఆయన మండిపడ్డారు. దీని వెనుక రాష్ట్ర పెద్దలు ఎవరున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనను మానసికంగా ఇబ్బంది పెట్టాలని నిర్ణయించినట్టు ఈ ఘటనతో అర్థమవుతుందన్నారు. అయినప్పటికీ భయపడే ప్రసక్తే లేదన్నారు.