శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 మార్చి 2021 (13:02 IST)

జగన్ సర్కారు ముందుకొస్తే స్టీల్ ప్లాంట్ కేంద్రం స్పందింస్తుంది : కిషన్ రెడ్డి

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా పిలువబడే వైజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో ఉద్యమం జరుగుతోంది. ఇది నానాటికీ ఎక్కువైపోతుంది. అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 
 
ఈ క్రమంలో ప్రైవేటీక‌ర‌ణ‌ నిర్ణయాన్ని తీసుకున్న కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక  ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర హోం శాఖ స‌హాయ‌ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు.
 
ఆయన ఆదివారం ఢిల్లీలో మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. నష్టాల్లో కొన‌సాగుతోన్న విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను నడపడం భారమన్నారు. 
 
ఒక వేళ‌ స్టీల్‌ప్లాంట్‌ను త‌మ ప‌రిధిలోకి తీసుకోవడానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం ముందుకొస్తే ఆ విష‌యంపై కేంద్ర స‌ర్కారు ఆలోచిస్తుంద‌ని తెలిపారు. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ల‌ కోసం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంద‌ని చెప్పారు.
 
మరోవైపు, విశాఖ ఉక్కు విషయంలో కొందరు వైసీపీ నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. రాజీనామాలు చేస్తే ప్రైవేటీకరణపై ఎలా పోరాడతామని మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 
 
చివరి అస్త్రం రాజీనామాలన్న పరిశ్రమల శాఖ మంత్రి ఇప్పుడు సమయం వచ్చిందని గుర్తించాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి విశాఖ ఉక్కుకోసం పోరాడాలని కోరారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా ముందుకువచ్చి పోరాడితే, ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అప్పుడే కేంద్రంపై ఒత్తిడి వస్తుందని గంటా అభిప్రాయపడ్డారు.
 
ప్రధాని స్థాయిలో నరేంద్ర మోడీ అన్నీ అమ్మేస్తామని చెప్పడం సరికాదన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడ్డాయన్నారు. ఉక్కు పరిశ్రమ ఆవశ్యకతపై సీఎం లేఖ రాయడంతోపాటు టీడీపీ, జనసేన, వామపక్షాలు బాసటగా నిలబడ్డాయన్నారు.