శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జులై 2021 (12:38 IST)

జలవివాదంలో జగన్ సర్కారు కీలక నిర్ణయం.. సుప్రీంను ఆశ్రయించాలని..?

కృష్ణానదీ జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో వివాదం నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జల వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా పిటిషన్ దాఖలుకు కసరత్తు చేస్తోంది. అంతర్రాష్ట్ర నదులపై వున్న ప్రాజెక్ట్‌లను విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్ట్‌లుగా గుర్తించాలని ఏపీ సర్కార్ కేంద్రాన్ని కోరింది.
 
నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని డిమాండ్ చేసింది. తక్షణమే తెలంగాణ జీవోను సస్పెండ్ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. కేఆర్ఎంబీ విధివిధానాల ఖరారుకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంను కోరనుంది ఏపీ సర్కార్. 
 
రైతులు, ప్రజల హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోందని జగన్ సర్కార్ ఎద్దేవా చేసింది. సముద్రంలోకి విలువైన జలాలను కలిసేలా పరిస్ధితులు సృష్టించి మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో తెలిపే అవకాశం వుంది. 
 
అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సర్కార్.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ)లో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) రామచంద్రరావు దీనిపై వాదించారు. 
 
గతంలో రాయలసీమ ఎత్తిపోతలపై గవినోళ్ల శ్రీనివాస్‌ వేసిన పిటిషన్‌పై విచారణను ఎన్జీటీ ఇవాళ్టికి వాయిదా వేసింది. కానీ, ఇవాళ విచారణకు రాకపోవడంతో తాము కూడా ధిక్కరణ పిటిషన్‌ వేశామని ఏఏజీ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు.