గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (19:29 IST)

ఏపీ అసెంబ్లీని ప్రోరోగ్ చేసిన గవర్నర్ .. ఆర్డినెన్స్ జారీకి వ్యూహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతోపాటు శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీచేశారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో అసెంబ్లీని ప్రోరోగ్‌ చేయడంతో అధికార వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్‌ తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించినట్లు అయింది. కాగా బిల్లులు మండలి ముందున్న సమయంలో సభలను ప్రోరోగ్‌ చేస్తే ఆర్డినెన్స్‌ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. 
 
నిజానికి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి వెనక్కి పంపింది. దీంతో మండలి తీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాసనమండలిని రద్దు చేసింది. ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ అయిన సందర్భంగా మండలి రద్దు బిల్లును ఆమోదించాలని కోరారు. 
 
ఇదిలావుంటే, వికేంద్రీకరణ బిల్లును మండలి ఛైర్మన్ షరీఫ్.. సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీకి పేర్లు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి ఛైర్మన్ ఆదేశించారు. కానీ కార్యదర్శి మాత్రం ఆ ఫైల్‌ను వెనక్కి పంపించారు. దీనిపై మండలి ఛైర్మన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 48 గంటల్లో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాల్సిందేనని మరోసారి మండలి ఛైర్మన్ ఆదేశించారు. 
 
ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే ఉభయసభలను ప్రోరోగ్ చేయడంతో ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొస్తే వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు పరిగణనలోకి వచ్చినట్లేనని సర్కార్ ఆలోచిస్తోంది. ఆర్డినెన్స్ ద్వారా ఈ రెండు బిల్లులు ఆమోదిస్తే.. కార్యాలయాలు తరలించాలని భావిస్తోంది. మరోవైపు ఈ బిల్లులపై హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈనెల 25న ఈ బిల్లులపై హైకోర్టు విచారించనుంది.