మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (11:43 IST)

ఆంధ్రాలో బీటెక్ కోర్సులకు రూ.2 లక్షల ఫీజు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సుకు ఫీజును ఏఐసీటీఈ ఖరారు చేసినట్టు సమాచారం. కొత్త విద్యా సంవత్సరం (2020-21)లో బీటెక్ కోర్సుకు రూ.2 లక్షల ఫీజును వసూలు చేసేలా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే, ఎంటెక్ కోర్సుకు ఫీజు రూ.3 లక్షల వరకు పెంచే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఏడో సెంట్రల్‌ పే కమిషన్‌(సీపీసీ)ని దృష్టిలో పెట్టుకుని ఆయా కోర్సుల గరిష్ట ఫీజులను నిర్ణయించాల్సి రావడమే ఇందుకు కారణం. అంటే ఇంజనీరింగ్‌తో పాటు ఇతర ప్రొఫెషనల్‌ కోర్సుల ఫీజు స్థిరీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వ చేతిలో లేదు. సాంకేతిక విద్య అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. దీని అధీనంలోని ఏఐసీటీఈ చట్టం అమలుకు తాజా మార్గదర్శకాలకు లోబడే ఆ యా కోర్సుల ఫీజులను నిర్ణయించాల్సి ఉంటుంది.
 
అప్రూవల్‌ ప్రాసెస్‌ హేండ్‌బుక్‌ 2020-21 6వ సీపీసీ ప్రకారం.. బీటెక్‌ కనిష్ట/గరిష్ట ఫీజు రూ.1.5 నుంచి రూ.2 లక్షలుగా, ఎంటెక్‌ కనిష్ట/గరిష్ట ఫీజు రూ.2.50 నుంచి రూ.3 లక్షలుగా నేషనల్‌ ఫీ కమిటీ ఫిక్స్‌ చేసిన ఫీజును రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకోవాలని ఏఐసీటీఈ గతంలోనే ఆదేశాలు జారీచేసింది. అయితే అప్పట్లో ఏఐసీటీఈ చట్టానికి మార్గదర్శకాలు లేకపోవడంతో రాష్ట్రాలు వాటిని ప్రాతిపదికగా తీసుకోలేదు. కానీ తాజా మార్గదర్శకాలు కూడా ఇవ్వడంతో వాటి ప్రాతిపదికగా ఫీజులను నిర్ణయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.