బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (12:52 IST)

#DelhiResults : ఢిల్లీ ఓట్ల లెక్కింపు : ఆప్-56, బీజేపీ-14 కాంగ్రెస్-0...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఆప్ పార్టీ సరికొత్త విజయం దిశగా దూసుకెళుతోంది. ముఖ్యంగా, ఎర్లీ ట్రెండ్స్ మేరకు.. ఆప్ పార్టీ ఏకంగా 56 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంటే.. బీజేపీ 14 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయింది. ఫలితంగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థుల్లో ఒక్కరంటే ఒక్కరు గెలుపొందే అవకాశాలు లేవు. 
 
మరోవైపు, ఎన్నికల తుది ఫలితాలు రావడానికి కొద్ది గంటల ముందు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఒక పోస్టర్ ప్రత్యక్షమయింది. ఇది కాస్తా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్‌ను చూస్తే ఎన్నికల ఫలితాలకు ముందే బీజేపీ తన ఓటమిని ఒప్పుకున్నట్లుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 
 
ఈ పోస్టర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫొటో కూడా కనిపిస్తోంది. ఆ పోస్టర్‌పై 'విజయంతో మనం అహంకారులుగా మారకూడదు. పరాజయంతో మనం నిరాశకు గురి కాకూడదు' అని రాసివుంది. అయితే ఓట్ల లెక్కంపునకు కొద్ది గంటల ముందు బీజేపీ నేతలు తమ విజయం ఖాయమనే వ్యాఖ్యానాలు చేశారు. బీజేపీ నేత మనోజ్ తివారీ తాము ఢిల్లీలో 55 సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. 
 
అంతకుముందు తివారీ తాము 48 సీట్లు గెలుస్తామని ట్వీట్ చేశారు. కాగా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని బీజేపీ నేత విజయ్ గోయల్ హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించారు. కానీ.. అనూహ్యంగా ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఇలాంటి పోస్టర్లు కనిపించడంతో కాషాయ పార్టీ కార్యకర్తల్లో చర్చనీయాంశమయింది.