మంగళవారం, 9 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (18:15 IST)

అంగన్‌వాడీ సిబ్బందికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ సర్కారు

anganwadies agitaion
తమ సమస్యల పరిష్కారం కోసం గత 22వ రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ సిబ్బందికి ఏపీ ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 5వ తేదీలోగా విధుల్లో చేరాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనవరి 5వ తేదీకి విధులకు హాజరుకాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
 
తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో అంగన్‌వాడీలు సమ్మె చేపట్టారు. ఇది 22వ తేదీకి చేరుకుంది. పలు ప్రాంతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడిస్తూ, అధికార ప్రతినిధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మరోవైపు, ఆందోళన విరమించి తక్షణ విధుల్లో చేరాలని అధికార పార్టీ నేతలు కోరుతున్నారు. అయితే, అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
ఈ క్రమంలో అంగన్‌వాడీలకు ప్రభుత్వం సీరియస్‌ వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 5వ తేదీలోగా విధులకు హాజరుకావాలని అల్టిమేటం జారీచేసింది. విధులకు హాజరుకానివారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి అంగన్‌వాడీ సిబ్బందికి నోటీసులా జారీచేసింది. అయితే, ఇపుడు ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో అంగన్‌వాడీ సిబ్బంది దిగివస్తారా లేదా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.