శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (13:01 IST)

ఏపీలో పల్లెపోరు ప్రశాంతంగా ముగిసింది : ఎస్ఈసీ నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రశాంత వాతావరణంలో ముగిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పుకొచ్చారు. మొత్తం నాలుగు దశల్లో ఈ ఎన్నికలు జరుగగా, తుది దశ పోలింగ్ 21వ తేదీ ఆదివారంతో ముగిసింది. దీంతో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. 
 
ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అందించిన సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు విజయవంతం అయ్యాయని చెప్పారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఇదే ఉత్సాహంతో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలను కూడా జరపాలని నిర్ణయించామని, ఉద్యోగులు అందుకు సిద్ధం కావాలని, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీలు ఎప్పటికప్పుడు సరైన సూచనలు చేశారని కితాబిచ్చారు.
 
కోర్టు పరిధిలో ఒకటి, రెండు అంశాలు ఉన్నందున కొన్ని చోట్ల ఎన్నికలు జరపలేకపోయామని వెల్లడించిన నిమ్మగడ్డ, కేసులు పరిష్కారం కాగానే వాటికీ ఎన్నికలు జరుపుతామన్నారు. మునిసిపల్ ఎన్నికలకు మాత్రం ఎటువంటి అవరోధాలూ లేవన్నారు. 
 
ఈ పంచాయతీ ఎన్నికల్లో 16 శాతం మాత్రమే ఏకగ్రీవం అయ్యాయని, మిగతా చోట్ల పోలింగ్ నిర్వహించి, ఫలితాలను వెల్లడించామని తెలిపారు. 50 శాతం మంది మహిళలు, బలహీన వర్గాలకు చెందిన వారు విజయం సాధించారని అన్నారు. 10,890 మంది సర్పంచ్‌లు నేరుగా ఎన్నికయ్యారని నిమ్మగడ్డ పేర్కొన్నారు.
 
సాధారణ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చిందని, 80 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం శుభ పరిణామమన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల నుంచి ఇదే విధమైన స్పందన వస్తుందని భావిస్తున్నట్టు నిమ్మగడ్డ పేర్కొన్నారు. 
 
గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లోనే ఇప్పుడు కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, అందరికీ తెలిసిన ప్రాంతాల్లోనే ఇవి ఉంటాయి కాబట్టి, పట్టణ ఓటర్లు తమ వంతు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నిమ్మగడ్డ కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యఎప్పుడైనా వచ్చి ఓటేసి వెళ్లాలని అన్నారు.