ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (15:50 IST)

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో పరీక్షలు

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు ఏపీ పంచాయతీరాజ్ శాఖ శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్ వల్ల సొంతూళ్లకు వెళ్లిన అభ్యర్థులు.. వారుంటున్న చోటే పరీక్షా కేంద్రాలను ఎంచుకునే వెసులుబాటును కల్పించనుంది. ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను ఆగస్టులో నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
లాక్ డౌన్ కారణంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న కొంతమంది అభ్యర్థులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు వేరే ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాసే ఛాన్స్ లేకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ ఎగ్జామ్ సెంటర్లను మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. పరీక్షా కేంద్రాలను మార్చుకోవాలనుకునే అభ్యర్థులు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి జులై 2వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా ఎగ్జామ్ సెంటర్లను మార్చుకోవచ్చునని పేర్కొంది.
 
కాగా 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.