మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (14:45 IST)

జగన్ అధికారంలోకి వచ్చి ఏం లాభం : ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్న

పేదలతో పాటు.. సమాజంలోని ప్రతి ఒక్కరికీ మేలు చేస్తానని, తన తండ్రిలా మంచి పేరు తెచ్చుకుంటానంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఇపుడు చేస్తున్నదేంటని సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. 
 
రాష్ట్రంలో ఇసుకు మాఫియా పెరిగిపోయిందనీ, ఈ కారణంగా ఇసుక అందుబాటులో లేక నిర్మాణ రంగం క్షీణించిపోయిందన్నారు. ఫలితంగా అనేక కూలీలు ఉపాధిని కోల్పయారని చెప్పారు. అలాగే, పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ  పేరుతో అధిక ధరలకు భూములు కొనుగోలు చేయడం ఏంటని ఉండవల్లి ప్రశ్నించారు. 
 
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో సీఎం జగన్‌కు ఓ లేఖ రాశానని, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదన్నారు. ఇళ్ల స్థలాల కోసం కొన్న ఆవ భూములపై విచారణ జరిపించాలని తాను సీఎంను కోరినట్లు చెప్పారు. వాటిని అధిక ధర పెట్టి కొనుగోలు చేశారని, వాటికి ఇంత పెద్ద మొత్తంలో ధర ఉండదని ఉండవల్లి తెలిపారు. 
 
అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెబుతూ అధికారంలోకి వచ్చిన జగన్ మరి భూముల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నిలదీశారు. ఇది ఏపీ ప్రభుత్వ అసమర్థత అని, అధిక ధర‌ల‌కు భూములు కొని, ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
 
కాగా, ఏపీ సర్కారుకి ఇసుక విధానంపై కూడా సరైన ముందస్తు ప్రణాళిక లేదని ఉండవల్లి అన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగం క్షీణించిపోయిందని తెలిపారు. ఇసుక కష్టాలను ఇప్పటికీ తీర్చలేకపోతున్నారని ఆయన చెప్పారు. 
 
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక అందుబాటులో లేదని, ఇసుక విధానంలో అవినీతి జరగడం మాత్రమేకాకుండా కూలీలకు ఉపాధి లేకుండా పోతోందని తెలిపారు.
 
అలాగే, మద్యం విధానంలో పలు విషయాలను త్వరలోనే తేల్చి చెబుతానని ఉండవల్లి అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్ల కంటే ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ధరలు పెంచితే తాగేవారు తగ్గుతారనుకోవడం భ్రమేనని చెప్పారు.
 
అలాగే, రాజకీయ ప్రత్యర్థులపై వైసీపీ ప్రతీకార చర్యలకు పాల్పడడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు, ఎలక్షన్ కమిషన్‌ విషయంలో వచ్చిన తీర్పుల విషయంలో జడ్జిలపై వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు సరికాదని ఆయన చెప్పారు. 
 
జడ్జిలపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టడం సిగ్గుమాలిన చర్యని అన్నారు. నిమ్మగడ్డ రమేశ్ విషయంలో జగన్‌ ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారని ఉండవల్లి ప్రశ్నించారు.