1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు : ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణను హైకోర్టు తప్పుపట్టింది. విద్యార్థులకు ఇలా ఏకరూప ప్రశ్నపత్రంతో ఉమ్మడి పరీక్ష నిర్వహించడం విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29కి (కరిక్యులమ్, మూల్యాంకన విధానం) విరుద్ధమని తేల్చి చెప్పింది. 2022లో తీసుకొచ్చిన ఈ విధానం విద్యార్థుల హక్కులను హరించేలా ఉందని పేర్కొంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలను నిర్దిష్ట సమయంలో అభిప్రాయాలను చెప్పాలని ఒత్తిడి చేయడమే అవుతుందని, వారిని భయాందోళనకు గురిచేసినట్లుందని అభిప్రాయపడింది. తరగతి గది ఆధారిత మదింపు (సీబీఏ) ద్వారా పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత తీర్పునిచ్చారు.
సపోర్టింగ్ ది ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రోగ్రాం (సాల్ట్) కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలను ఉమ్మడి ప్రశ్నపత్రంతో నిర్వహించాలని, ఇందుకోసం రుసుములు చెల్లించాలని పేర్కొంటూ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) డైరక్టర్ 2022 అక్టోబరులో ఉత్తర్వులు జారీచేశారు. దీనిని సవాల్ చేస్తూ యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఫెడరేషన్ ఛైర్మన్, మరొక విద్యా సంస్థ కార్యదర్శి 2022లో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
పిటిషనర్ల తరపు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ 1-8 తరగతుల విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష విద్యా హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమని వాదించగా, దీంతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఈ పరీక్ష నిర్వహణను తప్పుపట్టారు. సాల్ట్ కార్యక్రమం పరిధిలోకి ప్రైవేటు పాఠశాలలు రావన్నారు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 30 ప్రకారం ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యేంత వరకు ఏ విద్యార్థి బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం లేదని గుర్తుచేశారు. సీబీఏ విధానం బోర్డు పరీక్ష కానప్పటికీ.. టైం టేబుల్ నిర్ణయించడం, ఏకరూప ప్రశ్నాపత్రంతో అందరికి కలిపి ఒకేసారి పరీక్ష నిర్వహించడం బోర్డు పరీక్షలా ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.