శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మే 2024 (12:32 IST)

ఎట్టకేలకు ఏబీ వెంకటేశ్వ రావుకు బిగ్ రిలీఫ్ - పోస్టింగ్ ఇస్తూ సీఎస్ జవహర్ ఆదేశాలు

ab venkateswara rao
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)ను ఎట్టకేలకు సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) తొలగించిన విషయం తెల్సిందే. పైగా, శుక్రవారమే ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌ ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 
రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసింది. డైరెక్టర్‌ జనరల్‌ ర్యాంక్‌ కలిగిన ఆయనకు ఐదేళ్లుగా పోస్టింగ్‌ ఇవ్వకుండా సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి వేధింపులకు గురిచేసింది. అక్రమ కేసులతో జగన్‌ ప్రభుత్వం, వైకాపా వీరభక్త అధికార గణం కూడా ఇష్టానుసారంగా వేధించింది. వీరిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన వారు కూడా ఉన్నారు. 
 
ఆ తర్వాత ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌ను సమర్థించింది. అనంతరం ఆయన హైకోర్టుకు వెళ్లగా.. ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. 
 
సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏ కారణంతో సస్పెండ్‌ చేశారో.. తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఏబీవీ సస్పెన్షన్‌ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఈ నెల 8న ఆదేశాలిచ్చింది. 
 
ఈ ఆదేశాలు జారీచేసి 22 రోజులు గడిచినా విధుల్లోకి తీసుకోలేదు సరికదా.. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్‌ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను సీఎస్‌ జవహర్‌రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోనూ ఏబీ వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.