కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు : సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఐదేళ్లుగా పోలీస్ వ్యవస్థను, అధికారాన్ని అడ్డుపెట్టుని అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను టీడీపీ నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై 153, 505, 125 సెక్షన్ల కింద కేసు పెట్టారు.
వైకాపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'మన టార్గెట్ ఇదీ అని దృష్టిలో పెట్టుకుని... దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. అవతలివారు (ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి) అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏవేం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలి. అంతే తప్ప రూల్ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదాం అని మనం కూర్చోకూడదు.
మనకు అనుకూలంగా, అవతలివాళ్ల ఆటలు సాగకుండా రూల్‌ని ఎలా చూసుకోవాలి? అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్ చేయాలనేది నేర్చుకుందాం. ఇందులో కౌంటింగ్ ఏజెంట్ తనవంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి మీరు (చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు) బాగా ఎక్కించాలి. పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు. కానీ, రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్‌గా వద్దు' అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.