శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 27 జనవరి 2022 (18:26 IST)

ఏపీలో నాడు- నేడు, తెలంగాణాలో మ‌న ఊరు - మ‌న‌ బ‌డి...కేసీయార్ కాపీ!

రాష్ట్రంలో అమలవుతున్న విద్యా పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తూ వాటిని అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని, విద్యారంగంలో అమలు చేస్తున్న పధకాలపై ప్రజాప్రతినిధులు అవగాహన కలిగివుండాలని మంత్రి కోరారు.
 
 
జాతీయ విద్యా విధానం లో భాగంగా స్కూల్స్ మ్యాపింగ్ పై విద్యాశాఖ రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు గురువారం ప్రారంభమయ్యాయి.సచివాలయంలోని 5 వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రారంభమైన తొలిరోజు సదస్సుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరు కాగా డిప్యూటీ సీఎం, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్య అతిదులుగా హాజరయ్యారు.
 
 
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ స్కూళ్ల మ్యాపింగ్ ద్వారా ఏవో అనర్ధాలు జరుగుతాయని వస్తున్న అపోహలు తొలగిపోవాలని, విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై  ఉందన్నారు. అందుకోసం మొదట ప్రజాప్రతినిధులకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా రంగానికి ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని, రాష్ట్రంలో అమలవుతున్న విద్యా పథకాలే అందుకు నిదర్శనమని మంత్రి అన్నారు. 
 
 
పొరుగు రాష్ట్రాలు కూడా ఇక్కడ విద్యా పథకాలను వారి రాష్ట్రాల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఇక్కడి నాడు-నేడు తరహాలోనే తెలంగాణలో మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతిని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు సుందరంగా తీర్చిదిద్దటం  జరిగిందని, ఆ పాఠశాలల వద్దకు వెళ్లి వాటి అందాలతో ప్రజలు ఫోటోలు దిగే పరిస్థితి నేడు కల్పించడం జరిగిందన్నారు.
 
 
జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న స్కూళ్ల మ్యాపింగ్ వల్ల విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది తప్ప ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవని చెప్పారు. ముఖ్యమంత్రి పదే పదే ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగిందని ఏ ఒక్క పాఠశాల మూత పడదని ఉపాధ్యాయ పోస్టులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్యాబోధన రాష్ట్రంలో విద్యార్థులందరికీ అందాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని మంత్రి అన్నారు. 
 
 
రాష్ట్రంలో అమలవుతున్న విద్యా కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న  విద్యార్థుల సంఖ్య పెరిగిన సంగతి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులు సూచన మేరకు జిల్లాల వారీగా కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేందుకు మంత్రి సురేష్ సుముఖం వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల పాటు జరిగే ఈ అవగాహన సదస్సు లకు ఆయా తేదీల్లో నిర్దేశించిన జిల్లాల ప్రజాప్రతినిధులు వారికి అనువుగా ఉన్న ఏ తేదిలో నైనా సదస్సుకు హాజరు కావొచ్చని మంత్రి కోరారు.
 
 
డిప్యూటీ సీఎం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు బాధ్యతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ నూతన విద్యా విధానం పాఠశాలల మ్యాపింగ్ వల్ల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు రావడంలేదని కేవలం ప్రతిపక్షాలు దీనిని సమస్యగా సృష్టిస్తున్నాయి అన్నారు. ఇప్పటివరకు అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు సైతం ఈ విధానం వల్ల నూతన భవనాలు రూపుదిద్దుకుంటాయన్నారు. పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనా విధానానికి తగినట్లుగా రాష్ట్రంలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తున్న మంత్రి సురేష్ కు అభినందనలు తెలిపారు.
 
 
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, కమిషనర్ సురేష్ కుమార్, ఎస్పీడి వెట్రిసెల్వి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజర్ మురళి, అడిషనల్ డైరెక్టర్లు పార్వతి, సుబ్బారెడ్డి, ప్రసన్నకుమార్, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జేడీ రామలింగం, మున్సిపల్ కమిషనర్ లు, స్పెషల్ ఆఫీసర్ లు, ఆర్ జే డీ లు, డీఈఓ లు పాల్గొన్నారు.