మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 27 ఏప్రియల్ 2017 (21:31 IST)

ఉద్యోగుల పిల్లల సంక్షేమానికి పెద్దపీట... మంత్రి పరిటాల సునీత

అమరావతి : సచివాలయ ఉద్యోగులతో పాటు వారి పిల్లల సంక్షేమానికీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అందుకోసమే సచివాలయంలో ప్రత్యేకంగా బేబీ కేర్ సెంటర్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సచివాలయంలోని ముడో బ్లాక

అమరావతి : సచివాలయ ఉద్యోగులతో పాటు వారి పిల్లల సంక్షేమానికీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అందుకోసమే సచివాలయంలో ప్రత్యేకంగా బేబీ కేర్ సెంటర్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సచివాలయంలోని ముడో బ్లాక్‌లో నిర్వహిస్తున్న బేబీ కేర్ సెంటర్‌ను గురువారం మధ్యాహ్నం ఆమె సందర్శించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సచివాలయంలో నిర్వహిస్తున్న బేబీ కేర్ సెంటర్లో 13 మంది వరకూ చిన్నారులు ఉన్నారన్నారు. చిన్నారుల బాగోగులను చూసుకోడానికి ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు, ఇద్దరు ఆయాలను ఏర్పాటు చేశామని మంత్రి సునీత తెలిపారు. 
 
ఉద్యోగులు విధి నిర్వహణకు ఆటంకం కలుగకుండా ఉండటంతో పాటు చిన్నారుల సంక్షేమానికి బేబీ కేర్ సెంటర్ నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగులు, వారి పిల్లల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. పిల్లల ఉల్లాసానికి ఆట వస్తువులు ఏర్పాటు చేశామన్నారు. బేబీ సెంటర్లలో కొన్ని సమస్యలున్నట్లు సిబ్బంది తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. సచివాలయంలో బేబీ కేర్ సెంటర్‌ను మోడల్ సెంటర్‌గా ఏర్పాటు చేశామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అపర్ణ తెలిపారు. 
 
ఇటువంటి సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే ఆలోచన ఉందన్నారు. ఆ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మున్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 55 వేల అంగన్వాడీ కేంద్రాలున్నాయన్నారు. ఈ కేంద్రాల ద్వారా అత్యుత్తమ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. అంతకుముందు మంత్రి పరిటాల సునీత... సచివాలయం బేబీ సెంటర్లో ఉన్న చిన్నారులతో ముచ్చటించారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అక్కడి సిబ్బందికి సూచించారు.