అమరావతి: మహిళా సాధికారితపై అమరావతి ప్రకటనను జూన్ నెలాఖరకు ప్రభుత్వానికి అందజేస్తామని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. శాసనసభ సమావేశ హాలులో మంగళవారం ఉదయం మహిళా సాధికారితపై అమరావతి ప్రకటనకు సంబంధించిన సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం మధ్యాహ్నం స్పీకర్ విలేకరులతో మాట్లాడారు. పవిత్ర సంగమం వద్ద ఫిబ్రవరి నెల్లో జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ చర్చల సారాంశం భావితరాలకు అందించడానికి అమరావతి ప్రకటన చేయదలచినట్లు చెప్పారు.
మహిళలకు, యువతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు, పరిష్కార మార్గాలు, అవకాశాలు అందిపుచ్చుకోవడం ఎలా... వంటివి అన్ని ఉంటాయని వివరించారు. దీనిని రూపొందించడానికి ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా నాయకత్వంలో ఒక కోర్ కమిటీని, ఒక సలహా కమిటీని నియమించినట్లు చెప్పారు. ఈ కమిటీలో ప్రభుత్వ అధికారులతోపాటు ఎన్జీఓ సంస్థలకు చెందినవారు, ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తలు ఉంటారని తెలిపారు. ఈ కమిటీ సభ్యులు వివిధ అంశాలపై చర్చించి, ప్రభుత్వ శాఖల నుంచి డేటా సేకరించి, వివిధ వర్గాలకు చెందినవారి నుంచి అవసరమైతే అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిప్రాయాలను సేకరిస్తారని చెప్పారు.
జాతీయ మహిళా పార్లమెంట్ మొక్కుబడి సమావేశంగా మిగలకూడదని, సమాజాన్ని, ప్రభుత్వాలను ప్రభావితం చేసేటటువంటి ప్రకటన వెలువరించాలనేది తమ ఉద్దేశం అన్నారు. రాజకీయాలకు అతీతంగా శాసనసభ వేదికగా ఈ ప్రకటన వెలువడుతుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళా సాధికారితకు సంబంధించి రూపొందించే ఈ ప్రకటనను ఏ ప్రభుత్వమైనా అమలు చేస్తుందన్నారు. ప్రకటనకు సంబంధించి సమావేశంలో పలు విషయాలను, ప్రధానంగా పది అంశాలపై చర్చ జరిగినట్లు స్పీకర్ తెలిపారు.
మహిళా విద్య, డిజిటల్ అక్షరాశ్యత-మహిళలు, మహిళల ఆరోగ్యం, పౌష్టికాహారం, పారిశ్రామిక రంగంలో మహిళలు, రాజకీయాల్లో మహిళలు, మహిళలకు సామాజిక భద్రత, మహిళల న్యాయపరమైన హక్కులు, పరిశోధన రంగంలో మహిళలు, సామాజికాభివృద్ధిలో మహిళలు, మహిళాభివృద్ధికి లక్ష్యాలపై చర్చినట్లు డాక్టర్ కోడెల వివరించారు. ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా మాట్లాడుతూ అమరావతి ప్రకటనను ఎలా రూపొందించాలనేదానిపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. కాలపరిమితి నిర్ణయించుకొని పని చేస్తున్నట్లు చెప్పారు.
పలు అంశాలపై అర్థవంతమైన చర్చలు
మహిళా సాధికారితపై అమరావతి ప్రకటన కోసం జరిగిన సమావేశంలో పలు అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. మహిళా సమస్యలను ఆమూలాగ్రం చర్చించారు. వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించారు. సామాజిక భద్రత, ఒంటరి మహిళల సమస్యలు, లింగ వివక్షత, మహిళా చట్టాలు, వేధింపులు, మహిళల ఆర్థిక స్వావలంబన, మహిళా రుణాలు, ఆత్మహత్యలు, బాలికలు మధ్యలోనే బడిమానవేయడం, మహిళలకు నైపుణ్య శిక్షణ... వంటి అన్ని అంశాలను చర్చించారు. వివిధ అంశాలపై నిపుణులు అభిప్రాయాలు తెలిపారు. మహిళలకు చట్టాల గురించి అవగాహన కల్పించడం, ఆస్తిలో మహిళలకు ఎన్టీఆర్ సమాన హక్కు కల్పించడం, మహిళలకు సంబంధించి నిధుల కేటాయింపు, డ్వాక్రా గ్రూపులు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి.
వంద మైళ్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలు
సమావేశంలో స్పీకర్ కోడెల మాట్లాడుతూ వంద మైళ్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలవుతుందని, మీరు రూపొందించే అమరావతి ప్రకటన ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. దేశానికే ఒక ఆదర్శవంతమైన ప్రకటన వెలువడాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల్లో చైతన్య వచ్చిందని, ‘‘నా పెన్షన్ ఏదీ, నాకు రావలసిన పథకం ఏదీ?’’ అని ప్రశ్నిస్తున్నారన్నారు. వారిలో ఇంకా చైతన్య రావాలని స్పీకర్ కోడెల అన్నారు.