బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (06:38 IST)

తిరుమ‌ల శ్రీ వ‌రాహ‌స్వామి ఆలయంలో 'బాలాలయ మహాసంప్రోక్షణ'

తిరుమలలోని శ్రీ భూ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 6 నుండి 10వ తేదీ వరకు 'బాలాలయం' కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది.  ఈ కార్యక్రమానికి డిసెంబ‌రు 5వ తేదీ రాత్రి అంకురార్పణం జరుగనుంది. 

సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం 'బాలాలయం' చేపడతారు. శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయ విమాన ప్రాకారానికి బంగారు పూత పూయ‌బ‌డిన రాగి రేకులు అమర్చేందుకు ఆరు నెల‌ల కాలం ప‌డుతుంది.

ఈ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు మూల విరామూర్తి ద‌ర్శ‌నం ఉండ‌దు. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో చెక్కతో విగ్రహాలను ఏర్పాటు చేస్తారు.

తదుపరి మహా సంప్రోక్షణ జరుగువరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. ఆలయంలోని యాగశాలలో డిసెంబ‌రు 6 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. డిసెంబరు 10వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. 
 
క్షేత్ర ప్రాశ‌స్త్యం  :
వేంకటాచలక్షేత్రంలోని తొలిదైవం శ్రీ ఆదివరాహస్వామి. ఈయన్నే 'శ్వేత వరాహస్వామి' అంటారు. క్షేత్రసంప్రదాయం ప్రకారం 'తొలిపూజ, తొలి నైవేద్యం, తొలిదర్శనం' జరుగుతున్న ఈ వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవేంకటేశ్వరుని దర్శించడం ఆచారం.

శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం శ్రీ వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.