శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (20:08 IST)

ఈ నెల 10 నుండి తిరుమలలో గీతా పారాయణం

భగవద్గీత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు ఈ నెల 10వ తేదీ నుండి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం ప్రత్యక్ష ప్రసారం చేస్తామని టీటీడీ అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు.

నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు గీతా పారాయణం శ్లోకపఠనం, వ్యాఖ్యానంతో మూడో విడత ట్రయల్ రన్ నిర్వహించారు.  వేదపారాయణందార్ కాశీపతి భగవద్గీత పారాయణం చేయగా వేదపండితుడు కుప్పా విశ్వనాథశాస్త్రి వ్యాఖ్యానం చెప్పారు. 

ఈ సందర్భంగా ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ సుందరకాండ పారాయణం, విరాటపర్వం పారాయణం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఇదే తరహాలో గీతా పారాయణం విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పారు.

సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఎస్వీబీసీలో ఈ పారాయణం ప్రత్యక్ష ప్రసారం ఉంటుందన్నారు. శ్లోక పఠనం, వ్యాఖ్యానంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాన్ని సూచిస్తూ గీతా పారాయణం ఉంటుందన్నారు.

అనంతరం పండితుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు. కాగా, ఇప్పటికే సెప్టెంబరు 1, 3వ తేదీల్లో రెండు విడతల్లో ట్రయల్ రన్ నిర్వహించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారాయణం జరిగేందుకు వీలుగా టిటిడి చర్యలు చేపట్టింది.

కార్యక్రమంలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, వేద పాఠశాల పండితులు పాల్గొన్నారు.
 
12న 4వ విడత సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం...
తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై సెప్టెంబరు 12వ తేదీన 4వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.

ఆ రోజు ఉద‌యం 7 గంటల నుండి  సుందరకాండలోని 12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 147 శ్లోకాలను అఖండ పారాయణం చేయనున్నారు.

తిరుమల వేద విజ్ఞాన పీఠం, వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేద పారాయణదారులు, పండితులు ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొననున్నారు.