రేపు తిరుమలలో సుందరకాండ ఆఖండ పారాయణం

tirumala
ఎం| Last Updated: బుధవారం, 5 ఆగస్టు 2020 (08:45 IST)
అశేష భక్తలోకాన్ని అమితంగా ఆకట్టుకుంటున్న సుందరకాండ పారాయణం మరో బృహత్తర అంకానికి సిద్ధమైంది. కరోనావేళ విపత్తులు తొలగి ధైర్యంతో ముందడుగు వేయడానికి తిరుపతి దేవస్థానములు ప్రసిద్ధ వేదపండితులతో సుందరకాండ పారాయణాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన విషయం విదితమే.

శ్రీ వేంకటేశ్వర భక్తిఛానల్ ద్వారా తిరుమల నాదనీరాజనం వేదిక నుంచి ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం తొలిసర్గ పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటి సర్గలోని మొత్తం శ్లోకాలను 200మంది వేదపండితులు జూలై 7వ తేదీన‌ ఏకకాలంలో పఠించగా..భక్తులందరూ తమ తమ ఇళ్ళల్లో ఎస్వీబీసీ ప్రత్యక్షప్రసారాన్ని వీక్షిస్తూ తాము శృతికలిపి కృతార్థులయ్యారు.

ఈ నేపథ్యంలో సుందరకాండలోని ద్వితీయ సర్గ నుంచి సప్తమ సర్గ వరకు ఉన్న మొత్తం 227 శ్లోకాలను ఈనెల 6వ తేదీన సుమారు 200 మంది వేదపండితులు అఖండ పారాయణం చేయనున్నారు.

తిరుమల నాదనీరాజన వేదిక ప్రాంగణంలో జరిగే ఈ సుందరకాండ అఖండ పారాయణంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(సంస్కృత విద్యాపీఠం), శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయం, శ్రీవేంటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ, తిరుమల ధర్మగిరి వేదపాఠశాలకు చెందిన వేదపండితులు పాల్గొని ఏకకాలంలో 227 సుందరకాండ శ్లోకాలను పారాయణం చేస్తారు.

భక్తులందరూ ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి జరిగే ఈ అఖండ పారాయణాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్షప్రసారంలో వీక్షించి తమ తమ ఇళ్ళనుంచే తాము పారాయణం చేసి తిరుమలేశుని అనుగ్రహాన్ని పొందాలని తిరుమల తిరుపతి దేవస్థానములు విజ్ఞప్తి చేస్తోంది.దీనిపై మరింత చదవండి :